Ponguleti Joining in Congress Party : కాంగ్రెస్ పార్టీలో చేరికపై బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు, అనుచరులకు పరోక్షంగా స్పష్టతనిచ్చారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల అభీష్టమే తన అభిమతమని.. రాబోయే మూడు నాలుగు రోజుల్లో పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 10 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో పొంగులేటి నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు తరలివచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 70 మంది నాయకులతో సమావేశంలో మాట్లాడించారు.
Ponguleti Clarity on Party Change : వీరిలో ఎక్కువ మంది నాయకులు పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకరక్తల మనస్సులో మొదటి నుంచీ ఒకే నిర్ణయం ఉందని.. అందరి అభిప్రాయం మేరకు పార్టీలో చేరికపై హైదరాబాద్ వేదికగా అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. 3, 4 రోజుల్లోనే పార్టీలో చేరే తేదీ, ఖమ్మం బహిరంగ సభ తేదీని ప్రకటిస్తాని వెల్లడించారు. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. తమతో పాటు కలిసి వచ్చే మరికొందరిని సమీకరించుకుని.. రాబోయే కురుక్షుత్ర యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమవుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని పొంగులేటి పునరుద్ఘాటించారు.
'నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరతానో చెప్తాను. అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటా. త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తేదీలు వెల్లడిస్తా. ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ త్వరలోనే ప్రకటిస్తా. నాపై బీఆర్ఎస్ నేతలు చాలా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని గమనిస్తున్నారు. ప్రజలు, అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నాను. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా. కేసీఆర్, బీఆర్ఎస్పైనే నా పోరాటం.' - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ
కమలం అనుకుంటే.. కాంగ్రెస్..! పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నప్పటి నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి. కొత్త పార్టీ పెడతారని లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ నేతలు సైతం పొంగులేటిని తమ గూటికి చేర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఓ దశలో పొంగులేటి సైతం కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల కర్ణాటక ఫలితాలతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ కలిసి ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.