తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం నగరపాలిక ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఖమ్మం నగరపాలక ఎన్నికలపై.. అధికారిక ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పర్యటన.. ఆ మరుసటి రోజే డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వేళ.. బల్దియా యంత్రాంగం ఎన్నికల కసరత్తును మరింత ముమ్మరం చేసింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం.. ఈసారి ఎన్నికలు జరగనుండగా.. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. కొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల క్షేత్రంలోకి దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.

KHAMMAM ELELCTIONS
ఊపందుకున్న ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ

By

Published : Feb 5, 2021, 8:23 AM IST

ఖమ్మం నగరపాలిక ఎన్నికలకు అధికారుల కసరత్తు

ఊపందుకున్న ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికకు.. చేపట్టాల్సిన ప్రధాన ప్రక్రియపై బల్దియా యంత్రాంగం కసరత్తులు మరింత ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన ప్రక్రియగా ఉన్న డివిజన్ల పునర్విభజనకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో అధికార యంత్రాంగం.. ఎన్నికల కార్యాచరణపై పూర్తి స్థాయిలో దృష్టిసారించేందుకు సమాయత్తమవుతోంది.

సీడీఎంఏకు ఓటర్ల జాబితా..

పునర్విభజనకు మార్గదర్శకాలు విడుదల కావాలంటే.. ముందు బల్దియా యంత్రాంగం సీడీఎంఏకు ఓటర్ల జాబితా అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే నగరపాలక సంస్థ నుంచి.. ఓటర్ల జాబితా సీడీఎంఏకు అందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయినందున ఎప్పుడైనా డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి పురపాలక శాఖ షెడ్యూల్ ప్రకటించగానే పునర్విభజన ముమ్మరం కానుంది.

కైకొండాయిగూడెం నుంచే పునర్విభజన..

దాదాపు నెలరోజులపాటు సాగే డివిజన్ల విభజన.. అత్యంత కీలకంగా మారనుంది. నగరం ఉత్తర దిక్కు నుంచి ప్రారంభించి, తూర్పు, దక్షిణం పశ్చిమ దిక్కులవారీగా వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. ప్రతీ డివిజన్‌కు సహజ సరిహద్దులను నిర్దేశించుకుని అవి లేని చోట ఇతర ప్రక్రియల ద్వారా చేపట్టనున్నారు. ఇలా ఈసారి కైకొండాయిగూడెం నుంచే పునర్విభజన ప్రారంభం కానుంది.

తాజా ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని.. డివిజన్ల పునర్విభజన చేయనున్నారు. ప్రతీ వార్డులోనూ ఓటర్ల సంఖ్య మధ్య వ్యత్యాసం పది శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి. ప్రస్తుతం నగరపాలక సంస్థలో మొత్తం 2 లక్షల 70 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ప్రతి డివిజన్‌లో దాదాపు 4,500 మంది ఓటర్లు ఉంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కో డివిజన్‌లో ఓటర్ల సంఖ్య 4 వేల 500 నుంచి 5 వేల వరకు ఉంటుందన్న మాట.

అప్పుడే ఎన్నికల నగారా..

ఇక ఎన్నికల నోటిఫికేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పాలకవర్గం గడువు మార్చి 15 వరకు ఉంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను.. అధికార యంత్రాంగం వేగవంతం చేస్తోంది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త డివిజన్ల వారీగా ఓటర్ల తుదిజాబితాను ప్రచురిస్తారు. అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత.. ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించనుంది.

డివిజన్ల పునర్విభనజపై యంత్రాంగం అధికారిక ప్రక్రియకు సమాయత్తమవుతుండగా.. రాజకీయ పార్టీలన్నీ పోరుకు సై అంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి.

తెరాస ఇప్పటికే..

అధికార తెరాస ఇప్పటికే నగరంలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే.. పెండింగ్​లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే నగరంలో ప్రాంతాల వారీగా బహిరంగ సభలు నిర్వహించి.. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సిద్ధం చేశారు. ఒకటో, రెండో, మూడో పట్టణ ప్రాంతాల్లో.. భారీ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు.

ఈనెల 7న ఖమ్మంకు ఠాగూర్​..

కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాలు సైతం ఈసారి ఎన్నికల్లో.. సత్తా చాటేందుకు కార్యాచరణను ప్రారంభించాయి. ఈనెల 7న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్.. మాణిక్కం ఠాగూర్ ఖమ్మం రానున్నారు. ఆయనతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క... పార్టీ ముఖ్యనేతలతో నగర పాలక ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఇవీచూడండి:ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాల దస్త్రంపై సీఎం సంతకం

ABOUT THE AUTHOR

...view details