కరోనా సంక్షోభం వేళ... కేవలం బిల్లుల ఆమోదం కోసమే కాకుండా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. బిల్లులే కాకుండా ప్రస్తుత సమస్యలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. బిల్లుల వివరాలపై ఈ నెల15న చర్చిద్దామని స్పీకర్ చెప్పినట్లు నామా వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు.
దాన్ని వ్యతిరేకిస్తాం..
విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉందని.. దాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. 11 ఆర్డినెన్స్‌లను కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టబోతోందని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 25 బిల్లులు ఉండగా... వాటిల్లో కొన్ని ప్రజావ్యతిరేక బిల్లులు ఉన్నట్లు తెలుస్తోందని నామా సందేహం వ్యక్తం చేశారు.