తెలంగాణ

telangana

ETV Bharat / state

దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో ఎన్నెస్పీ భూములు - telangana varthalu

ఖమ్మం జిల్లాలో ఆక్రమణల పర్వంతో ఎన్నెస్పీ భూములు, కాల్వల ఆనవాళ్లు కోల్పోయి కుచించుకుపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో ఎన్నెస్పీ భూములు విస్తరించి ఉంటే వాటి వివరాలపై స్పష్టత లేదు. ఏటీకేడు ఆక్రమణల పర్వం పెరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. ఎన్నెస్పీ కాల్వల్లో పుష్కలంగా నీరు పారుతున్నా..భూముల ఆక్రమణల పర్వంతో చివరి ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది.

దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో ఎన్నెస్పీ భూములు
దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో ఎన్నెస్పీ భూములు

By

Published : Mar 23, 2021, 4:50 AM IST

Updated : Mar 23, 2021, 6:47 AM IST

దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో ఎన్నెస్పీ భూములు

ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ భూములు, అనుబంధ కాల్వలకు చెందిన భూములన్నీ దశాబ్దాలుగా కబ్జాకోరుల కబంధ హస్తాల్లోనే మగ్గుతున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 16వేల 450 ఎకరాల విస్తీర్ణంలోని భూములకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఎన్నెస్పీ ప్రధాన కాలువతోపాటు పిల్ల కాలువలు రూపును కోల్పోయాయి. జిల్లాలో 17 మండలాల్లో కాలువ ప్రవహిస్తుండగా... అత్యధిక మండలాల్లోని భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి.

ఇష్టారాజ్యంగా ఆక్రమణలు

జిల్లాలో సాగర్ కాలువలు మొత్తం 600 కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్నాయి. సాగర్ కాల్వలకు రెండు వైపులా ఇష్టారాజ్యంగా ఆక్రమణలు ఉన్నాయి. మేజర్ కాలువ వెడల్పు దాదాపు 60 నుంచి 70 అడుగుల వరకు ఉండేది. ప్రస్తుతం ఆక్రమణలకు గురై.. 20-30 అడుగుల మేర మాత్రమే ఉంది. ఖమ్మంతో పాటు చుట్టుపక్కల మండలాలు, ఇతర ప్రాంతాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో పక్కనే పంట భూములన్న వారు కాలువ భూముల్ని కలిపేసుకుంటున్నారు. ఇంకొందరు కాల్వల పక్కనే నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలువ పక్కన వెంచర్లు వేస్తున్న వారూ.. ఎన్నెస్పీ భూములను కొల్లగొడుతున్నారు.

భూములను కాపాడేందుకు కమిటీలు

ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. నాగార్జునసాగర్‌ కాలువ భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. భూములను కాపాడేందుకు రెండు టాస్క్​ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు సూపరింటెండ్ ఇంజినీర్ స్థాయి అధికారులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం జరిగే సర్వే సమగ్రంగా సాగితేనే కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

Last Updated : Mar 23, 2021, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details