భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో తన కన్నబిడ్డను వేరొకరికి అప్పగించిన ఘటన ములుగు జిల్లా మంగపేటలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త హుటాహుటిన వెళ్లి బిడ్డను తిరిగి ఇమ్మని అడగ్గా వారు నిరాకరించారు. చివరకు పోలీసులు, చైల్డ్ లైన్ అధికారుల సహాయంతో తన చిన్నారిని సొంతం చేసుకున్నాడు.
ఇదీ జరిగింది...
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సత్యవేణి, రమేష్‌లు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రమేష్ హైదరాబాద్‌లోని బంగారం దుకాణంలో పనిచేస్తుండేవాడు. అయితే భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగా సత్యవేణి హైదరాబాద్ వెళ్తూ తన 3 నెలల చిన్నారిని భద్రాద్రి జిల్లా మణుగూరులోని ఓ హోటల్లో పనిచేసే గంగ అనే మహిళకు క్షణికావేశంలో అప్పగించింది. విషయం తెలుసుకున్న భర్త గంగ వద్దకు వెళ్లి పాపను ఇమ్మని అడగ్గా ఆమె నిరాకరించింది. తర్వాత ఐసీడీఎస్ అధికారులు పాపను స్వాధీనం చేసుకున్నారు.