Minster Puvvada Latest Press Meet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయకేతనం ఎగురవేస్తోందని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామ నాగేశ్వరరావు.. పలువురు ముఖ్యనేతలు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీ తాతా మధు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని తెరాస లోకసభాపక్ష నేత నామ ఆరోపించారు. ప్రజల హక్కులను హరించేలా కేంద్ర విధానాలు ఉంటున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఒకట్రెండు తప్పితే.. ఏ ఎన్నికలు పెట్టినా కూడా.. తెరాసనే విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నేతలు.. తెరాస విజయమే లక్ష్యంగా కృషి చేస్తారు. ఇప్పడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధు మంచి ఆధిక్యంతో విజయం సాధిస్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు. ప్రజల హక్కులను కాలరాసేలా కేంద్రం విధానాలను అవలభిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది. ధాన్యం సేకరణపై డిమాండ్ చేస్తే కేంద్రం పట్టించుకోవట్లేదు.
-ఎంపీ నామ నాగేశ్వరరావు
తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్..
ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్‌సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.