Puvvada Ajay: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్మ సామాజిక వర్గంలో నాకు మంత్రి పదవి ఇవ్వటం నిజంగా అదృష్టమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి కొడాలి నానిని తొలగించారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గం నుంచి నన్ను తొలగించేందుకు నాపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్మించిన కమ్మ మహాజన సమితి కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ సామాజికవర్గం, మంత్రులపై కుట్రలు చేసి పదవుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనికి కొందరు చౌదరీలు సహకారం చేస్తున్నాయని పరోక్షంగా మండిపడ్డారు.
మన సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోంది. కేసీఆర్ కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. కొంతమంది మనపై కుట్రలు చేస్తున్నారు. దీనిపై మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బలహీన వర్గాల సాధికారతకు కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ మహనీయుడు ఒక గొప్ప రాజకీయ మార్పు తీసుకొచ్చాడు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ తరహాలో పాలన సాగిస్తున్నారు. ఏపీలో మాత్రం ఉన్న కమ్మ సామాజిక వర్గ మంత్రిని కూడా పీకేశారు.
- పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి