ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరిట జరిగిన అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కార్పొరేషన్ రుణం అందితే ఏదో వ్యాపారం చేసి బతుకుబాగు చేసుకుందామని భావించే అమాయకులు దళారీల బారిన పడి మోసపోతున్నారు. అప్పులు ఇప్పిస్తామని మాయమాటలతో నిలువునా ముంచేస్తున్నారు. కావాల్సిన చోట సంతకాలు తీసుకొని... సొమ్ము స్వాహా చేస్తున్నారు. చివరకు బ్యాంకు అధికారులు చూపిన లెక్కలు చూసి లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో తెలియక అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. లక్షల గోల్‌మాల్ అయిన ఈ తతంగంపై యంత్రాంగం ముమ్మర విచారణ చేస్తోంది.
మంజూరులో జాప్యం
ఎస్సీ కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. 2015-16 ఏడాదిలో అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 220 మంది ఆసక్తి చూపగా 201 మందిని అర్హులుగా గుర్తించారు. అప్పులు మంజూరు విషయంలో మాత్రం జాప్యం జరిగింది. రుణాలు వస్తే బాగుపడొచ్చని భావించి... కోర్టుకు వెళ్లి మరీ మంజూరు అనుమతులు తెచ్చుకున్నారు. ఇంత చేసిన లబ్ధిదారులు తమ వెనుక జరుగుతున్న అవినీతి బాగోతాన్ని మాత్రం గుర్తించలేకపోయారు.
మాయమాటలతో ఒప్పందం
లబ్ధిదారుల బలహీనతల్ని గమనించిన ఖమ్మంవాసి వేముల సునీల్ మాయమాటలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టించి బ్యాంకు ఖాత నెంబర్లు, ఏటీఎం, ఆధార్ కార్డుల్ని తీసుకున్నాడు. వాటి ఆధారంగా బ్యాంకు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రుణాలు పొందాడు. ఒక్కో లబ్ధిదారుకు లక్ష నుంచి 7 లక్షల వరకు అప్పు మంజూరు కాగా లబ్ధిదారులకు కేవలం 60 వేల నుంచి 80 వేలు ఇచ్చాడు.