తెలంగాణ

telangana

ETV Bharat / state

Tallada co-operative society: ఆ రైతులు చెల్లించిన రుణం.. ఏ అధికారి జేబులోకి వెళ్లిందో..!

వారంతా సన్న, చిన్నకారు రైతులు. రైతు సంక్షేమం కోసం నెలకొల్పిన వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులు. తక్కువ వడ్డీ ఉందన్న ఆశతో స్థానిక సహకార సంఘంలో రుణాలు తీసుకున్నారు(Loan scam in thallada co-operative society). పంట చేతికొచ్చాక ఆ రుణాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇలా ఏళ్లుగా అప్పులు తీసుకోవడం, మళ్లీ చెల్లించడం పరిపాటిగానే సాగుతుంది. రైతుల శాపమో.. సొసైటీ నిర్వాకమోగానీ.. చెల్లించిన అప్పులు తిరిగి చెల్లించాలంటూ అన్నదాతలకు నోటీసులు అందుతున్నాయి. అసలు వడ్డీతో కలిపి వెంటనే చెల్లించాలంటూ రోజుకు ఇద్దరు ముగ్గురికి నోటీసులు చేతిలో పెడుతున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ వ్యవసాయ సహకార సంఘంలో రుణాల బాగోతంలో వెలుగులోకి వస్తున్న వాస్తవ అంశాలు సొసైటీ నిర్వాకాలకు అద్దం పడుతుంటే.. కర్షకుల వెతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

loan
loan

By

Published : Sep 20, 2021, 1:43 PM IST

మొన్న సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీలో తరుగు పేరిట రైతుల్ని నట్టేట ముంచిన వైనం..నిన్న ఏదులాపురం సహకార సంఘంలో మామిడి, పామాయిల్ తోటల్లో ధాన్యం పండించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి సహకార దోపిడీకి పాల్పడ్డ ఉదంతం.. ఇవన్నీ మరువక ముందే ఖమ్మం జిల్లాలో (khammam) మరో వ్యవసాయ సహకార సంఘంలో రుణాల గోల్ మాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది (Loan scam in co-operative society).

కట్టలేము అప్పు... పేదరైతులమండి... ఓ అయ్యా!

తల్లాడ వ్యవసాయ సహకార సంఘంలో సాగుతున్న రుణాల బాగోతం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది(thallada co-operative society). రైతులను నమ్మించి వంచనకు గురిచేసిన కొందరు అధికారుల తీరుతో రైతులు నిలువునా దగా పడ్డారు. తల్లాడ సొసైటీ పరిధిలో మొత్తం 20 గ్రామాలు, 13 పంచాయతీలు ఉన్నాయి. 2,700 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ నుంచి రైతులకు ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో రైతులంతా సాగు పెట్టుబడులతో పాటు వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడుల కోసం సొసైటీని ఆశ్రయించి రుణాలు తీసుకున్నారు. పంట దిగుబడులు వచ్చినప్పుడో, చేతిలో డబ్బు ఉన్నప్పుడో రుణాలు చెల్లిస్తూ వచ్చారు. కానీ.. గతంలో సొసైటీలో చోటు చేసుకున్న అక్రమాల బాగోతాలు ఇప్పుడు రైతులకు శాపంగా మారాయి. రుణాలు చెల్లించిన రైతులకే మళ్లీ అప్పు కట్టాలంటూ నోటీసులు (loan due notices) అందుతున్నాయి.

ఎప్పుడు ఏ ఫోన్​ వస్తుందోనని..

రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులకు సొసైటీ సిబ్బంది నోటీసులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు తమకు నోటీసులు అందాయంటూ ఆరుగురు సభ్యులకు బయటకు వచ్చారు. గతంలోనే వారి అప్పులు మొత్తం వడ్డీతో సహా చెల్లించినా... ఆ రుణాలే మళ్లీ చెల్లించాలంటూ సొసైటీ నుంచి నోటీసులు రావడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ ‌ఆరుగురే కాదు సొసైటీలో దాదాపు మరో 50 మంది వరకు రైతుల పేరిట రుణాలు బకాయిలు(loan due in co-operative society) చూపుతున్నట్లు తెలిసింది. దీంతో సొసైటీ నుంచి ఫోన్ వస్తుందంటే రైతులు హడలిపోతున్నారు.

సొసైటీలో నేను అప్పు తీసుకోలేదు. కానీ వడ్డీ కట్టమని నాకు నోటీసు పంపారు. సొసైటీ దగ్గరకు వెళ్లి చూస్తే నా పేరుమీద రూ. 10వేలు తీసుకుట్టుగా ఉంది. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి ఇప్పుడు రూ. 12,500 ఉంది. అప్పు తీసుకున్నట్లు కనీసం నా పాసు పుస్తకంలో కూడా లేదు. ఇప్పుడేమో ఆ డబ్బంతా కట్టమని అంటున్నారు. -సుంకర రోసయ్య, రైతు

నా భార్య పేరుపై 2010లో లోన్​ ఉంటే అప్పుడే చెల్లించాము. ఇప్పుడేమో రూ.52వేలు చెల్లించాలని చెబుతున్నారు. సుమారు పదేళ్ల క్రితం క్లోజ్​ చేసిన ఖాతాలో పెండింగ్​ ఉందని చెబుతున్నారు.బాధితుడు

ఆ సొమ్మెవరి జేబుల్లోకెళ్లిందో..!

రైతులు చెల్లించిన రుణాలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నదానిపై సహకార సంఘంలో జోరుగా చర్చ సాగుతుంది. ఈ రుణాల గోల్​మాల్ (loan amount scam) వెనుక మాజీ సీఈవో హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు చెల్లించిన అప్పు డబ్బును తీసుకుని బకాయి చెల్లించినట్లు రికార్డుల్లో నమోదు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు చెల్లించిన అప్పు సొమ్మంతా తన జేబులే వేసుకున్నట్లు రైతులు అంటున్నారు. తాము అప్పులు చెల్లించినా మళ్లీ చెల్లించాలంటున్నారేంటని... మాజీ సీఈవోను రైతులు నిలదీస్తే.. నేనే చెల్లిస్తానంటూ ఆయన బదులివ్వడం ఆయనపై వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక సొసైటీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, మాజీ సీఈవో వీరారెడ్డిపై వస్తున్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరపాలంటూ ప్రస్తుత పాలకవర్గం జిల్లా సహకార శాఖ అధికారికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

తల్లాడ సొసైటీలో రూపే కార్డులు దొంగిలించి సుమారు రూ. 40లక్షల 56వేలు స్వాహా చేశారు. దానిలో సీవోకు కూడా పాత్ర ఉందని అతడిని సస్పెండ్​ చేశాము. అంతే కాకుండా రైతు రుణమాఫీ మొత్తాన్ని కూడా సీవో తీసుకుని రైతులకు ఇవ్వకుండా స్వాహా చేశాడు. అంతే కాకుండా లోన్​కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పేరుతో రుణాలు సీవో తీసుకునేవాడు. సొసైటీ పరిధిలో సుమారు 60 నుంచి 70 మంది రైతులు ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాము. -సొసైటీ సభ్యుడు

కొంత మంది రైతులు సొసైటీకి వచ్చి తాము గతంలో చెల్లించిన లోన్​కు సంబంధించి ఇప్పుడు నోటీసులు వచ్చాయని చెప్పారు. వాటిపై ఎంక్వైరీ వేశాము. గతంలో సీవోగా పనిచేసిన వజ్రాల వీరారెడ్డి అనే వ్యక్తి ... సొసైటీ ఖాతాలో జమచేయలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాము. -వీరమోహన్ రెడ్డి, తల్లాడ సొసైటీ ఛైర్మన్

పూర్తి వివరాలు తెలియాలి

సహకార సంఘంలో తీసుకున్న రుణాలు చెల్లించాలని రైతుల వద్దకు వెళ్లినప్పుడు మేం గతంలోనే చెల్లించామని కొందరు రైతులు సొసైటీ సిబ్బందికి చెప్పడంతో... ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:Farmer Income: హెక్టారు భూమి ఉన్న రైతుకు సగటు రాబడి ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details