ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గంలో ప్రచ్ఛన్నయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. అధికార తెరాసకు చెందిన మేయర్-కార్పొరేటర్ల మధ్య అంతర్గతపోరు మరోసారి రచ్చకెక్కుతోంది. గతంలోనే ఓసారి మేయర్ పాపాలాల్ మాకొద్దంటూ అసమ్మతిగళం వినిపించారు. పార్టీ అధిష్ఠాన జోక్యంతో అప్పుడు సద్దుమణిగిన గొడవ మరోసారి తెరపైకొచ్చింది. సొంత పార్టీ కార్పొరేటర్లతోనే సమన్వయం లేని మేయర్... తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, అతనితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కార్పొరేటర్లు కుండబద్ధలు కొడుతున్నారు. వరుసగా రహస్య భేటీలు నిర్వహిస్తూ... మేయర్‌ను తొలగించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
స్వార్థం, స్వలాభం కోసమే కొందరు కార్పొరేటర్లు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మేయర్ పాపాలాల్ చెబుతున్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా... అవేం పట్టించుకోకుండా కేవలం నగర అభివృద్ధి కోసమే కష్టపడతానంటున్నారు. పాలకపక్షం కుమ్ములాటలతో నగరపాలక సంస్థ పరువు మసకబారుతుండటమే కాకుండా... పట్టణ అభివృద్ధి కుటుంపడుతోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.