ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షాలు అన్నదాతల వెన్నువిరిచాయి. కర్షకుల ఆరుగాలం శ్రమ మరోసారి బూడిదలో పోసిన పన్నీరైంది. గత సీజన్లన్నింటికన్నా భిన్నంగా ఈ సారి ఆరంభం నుంచీ ఊరించి ఆశలు నింపిన వర్షాలే.. సీజన్ చివరి నాటికి రైతుల గుండెల్ని పిండేశాయి. భారీ వర్షాలు.. పంటలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రధాన పంటలైన పత్తి, పెసర పంటలు నష్టాలు మిగల్చగా.. మూడ్రోజులుగా కురుస్తున్న అధిక వానలు వరి పంటనూ నీటముంచేశాయి.
వేల ఎకరాలు.. నీటి పాలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలన్నీ అధిక వర్షాల ధాటికి నీటిపాలయ్యాయి. భద్రాద్రి జిల్లాలో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలోని మొత్తం 23 మండలాల్లో 4,126 మంది రైతులకు పంట నష్టం జరిగింది. 7,053 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. వీటిలో వరి 4,890 ఎకరాలు, పత్తి 1,723, వేరుశనగ 206, మిర్చి 234 ఎకరాలు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం.. మొత్తం 345 గ్రామాల్లో 53, 358 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 76, 819 ఎకరాల్లో వివిధ పంటలు నీటిపాలైంది. వీటిలో వరి 38,111 ఎకరాల్లో, 37,227ఎకరాల్లో పత్తి, కంది 26 ఎకరాల్లో, 1,455 ఎకరాలు.