ఖమ్మం జిల్లా పరిషత్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడుతున్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో తాత్కాలికంగా నిర్వహించనున్నారు. ఇదే ఆవరణలోని ఆర్‌డబ్ల్యూఎస్ డివిజన్ కార్యాలయం భవనాలను వినియోగించనున్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ నుంచి భద్రాద్రి కార్యాలయానికి దామాషా ప్రకారం కుర్చీలు, బెంచీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, ర్యాక్‌లు, వాహనాలు పంపిణీ చేయాలి. దీంతోపాటు ఉద్యోగులను సైతం వారి కేటగిరీల వారీగా విభజించి కొందరిని నూతన జిల్లా పరిషత్‌కు పంపనున్నారు. ఇందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు కలెక్టర్ కర్ణన్ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి, ఆగస్టు 6వ తేదీన ‘ఆర్డర్ టు సర్వ్’ పేరిట ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇలా జారీ చేసిన ఉత్తర్వులను ఉద్యోగులుకచ్చితంగా అంగీకరించి తీరాలి.
ఖమ్మం జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం 41 మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పనిచేస్తున్న పలు పాఠశాలల ఉపాధ్యాయులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలను ఖమ్మం జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్ ఖాతా వివరాలు అత్యంత ప్రధానం. ఈ ఖాతాలో ఉద్యోగులకు సంబంధించిన డబ్బు జమవుతుంది. ఆ డబ్బు ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఉద్యోగులకు అవసరమైనపుడు అర్హత మేరకు రుణం మంజూరు చేస్తుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత జీపీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న జీపీఎఫ్ ఖాతాల్లో గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి సరైన నమోదులు కాలేదని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు జడ్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేయాలి