తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలతో అన్నదాతలకు కష్టాలు - rain

ఎండనక వాననక కష్టం చేశారు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పంట సాగు చేశారు. ధాన్యం చేతికొస్తుందని ఆనందించేలోపే అకాల వర్షాలు పంటలను నేలపాలు చేశాయని కన్నీరుమున్నీరవుతున్నారు ఖమ్మం అన్నదాతలు.   కొండంత ఆశతో కోతలకు సిద్ధమవుతోన్న తరుణంలో గాలివాన కర్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులతో మామిడి, బొప్పాయి పంటలు నేలరాలాయి.

నేలకొరిగిన బొప్పాయి

By

Published : Apr 20, 2019, 7:28 AM IST

అకాల వర్షాలతో అన్నదాతలకు కష్టాలు

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ఖమ్మం జిల్లాలో మామిడి, బొప్పాయి రైతుల్ని నిండా ముంచాయి. చేతికొచ్చే దశలో ఉన్న మామిడి, బొప్పాయి పంటలు ఈదురుగాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న గాలివాన పంటల్ని నేలపాలు చేసింది. రైతులను తీవ్ర నష్టాల్లో ముంచెత్తింది. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మామిడి, బొప్పాయి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

రైతు కంట కన్నీరు

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో అకాల వర్షం రైతుల కంట కన్నీరు పెట్టించింది. మరో పది, పదిహేను రోజుల్లోనే పంట చేతికొచ్చే దశలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మంచి దిగుబడిని చూసి మురిసిపోయిన అన్నదాతల ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. లక్షలాది రూపాయలు దిగుబడినిచ్చే పంటలు వారి కళ్లముందే ధ్వంసమైపోయాయి. ఎక్కడికక్కడ మామిడి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బొప్పాయి చెట్లయితే గాలి దుమారానికి పూర్తిగా నేలకూలిపోయాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో వరి పంట నేలవాలింది. పలుచోట్ల మొక్కజొన్నకూ నష్టం తప్పలేదు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట కళ్లముందే నేలపాలవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఖమ్మం జిల్లా రైతులు. ఇవీ చూడండి: పట్టాలు తప్పిన పూర్వా ఎక్స్​ప్రెస్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details