మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారు బస్తారాం తండాలో విద్యుదాఘాతంతో కాడెడ్లు మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించారు. రైతు దీన పరిస్థితిపై "ఈనాడు-ఈటీవీ తెలంగాణలో "ఆశలు ఆవిరయ్యాయి" అనే పేరుతో ప్రసారమైన కథనాలకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలానికి చెందిన స్వచ్ఛంద సేవా సమితి అండగా నిలిచింది. ఈ మేరకు రూ.1.21 లక్షల విలువ గల రెండు కాడెడ్లను అందజేసి తమ ఉదారతత్వాన్ని చాటుకున్నారు. కాడెడ్లను అందుకున్న ఆ అన్నదాత కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ప్రమాదవ శాత్తు కాడెడ్లు మృతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారు బస్తారాం తండాకు చెందిన బానోతు సేట్యా-దర్గీ దంపతులది వ్యవసాయ ఆధారిత కుటుంబం. జులై 19న వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో విద్యుదాఘాతం సంభవించింది. ఇతర రైతులు విద్యుత్ మోటార్ల కోసం తీసిన కరెంటు తీగలకు కట్టిన జే వైరుకు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహించింది.
ప్రమాదవశాత్తు కాడెడ్ల మృత్యువాత...
ఈ క్రమంలో ఇంటికి వెళ్తున్న కాడెడ్లు ప్రమాదవశాత్తు తీగను తాకడంతో విద్యుతాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.1 లక్ష విలువ గల కాడెడ్లు మృత్యువాత పడటంతో ఆ రైతు కుటుంబం కన్నీటి పర్యంతమైంది. బాధిత రైతు దుస్థితిపై " ఈనాడు-ఈటీవీ తెలంగాణ"లో వచ్చిన కథనాలకు దాతలు స్పందించి ముందుకొచ్చారు.