తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు - సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు

సర్కారు పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతూ పూర్వ కళను కోల్పోతున్నాయి. కార్పొరేటు మోజులో తల్లిదండ్రులు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. వీటన్నింటిని అధిగమిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్న చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో అనేక మార్పులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దారు.

సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు

By

Published : Aug 29, 2019, 3:49 AM IST

సర్కారు బడిలో కంప్యూటర్​ చదువులు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంలో ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలకే తమ పిల్లలను పంపేవారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గింది. ఇది గమనించిన ప్రధానోపాధ్యాయురాలు స్పందన, ఉపాధ్యాయుడు వరప్రసాద్‌.. గ్రామస్థులతో చర్చించి పాఠశాలలో ఆంగ్ల బోధన ప్రారంభించారు. ప్రైవేటుకు దీటుగా డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టారు. ప్రాథమిక స్థాయిలోనే మరెక్కడా లేని విధంగా కంప్యూటర్‌ తరగతులు, సాంకేతిక విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. పాఠశాల ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.

గ్రామస్థుల సహాకారం

పిల్లలకు చదువు చెప్పాలనే తపన ఉన్న ఉపాధ్యాయులతోపాటు గ్రామ సర్పంచ్​ బద్ధం నిర్మల సహకారం, గ్రామస్థులు, దాతల చేయూతతో ఆదర్శ పాఠశాలగా మారింది. ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ద్వారా దేవిశెట్టి రవి సాంకేతిక విద్యకు అవసరమైన పరికరాలు అందించి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించారు. శుద్ధజలాలు అందించేందుకు సర్పంచ్​ నిర్మల చేయూతనిచ్చారు.

విజ్ఞానాన్ని పంచే గోడలు

ప్రభుత్వ విద్యాలయం ఇంత బాగుంటుందా.. అన్నట్లుగా రెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల ఆకట్టుకుంటోంది. ఐదు తరగతులకు గానూ రెండు భవనాలుండగా.. పిల్లలకు విజ్ఞానాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పటాలు, దేశనాయకుల చిత్రాలు, గణితం, మానవ శరీరంలోని అవయవాలు, సామాజిక దృక్పథాన్ని పెంచే చిత్రాలు.. గోడలు ఖాళీ లేకుండా రాయించారు. పిల్లలు కూర్చోవడానికి చిన్న కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకంలోనూ పౌష్టికాహారం అందిస్తున్నారు.

బాలల సంఘాలు ఉన్నాయి

గ్రంథాలయం, విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా బాలల సంఘాలు ఇక్కడ ప్రత్యేకతగా నిలిచాయి. ప్రస్తుతం 50 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల వృక్షాలుగా మారి పిల్లలకు నీడనిస్తున్నాయి. స్వచ్ఛభారత్‌లోనూ ముందంజలో ఉన్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రత్యేక బస్సులో నేడు కాళేశ్వర సందర్శనకు జిల్లా కలెక్టర్లు

ABOUT THE AUTHOR

...view details