తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ - భద్రాద్రి రామయ్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర మధ్య చైత్రశుద్ధ నవమి అభిజిత్​ లగ్నమున సీతారాములకు కల్యాణం వైభవంగా జరగనుంది. ఏటా భక్తుల కోలాహలం మధ్య వైభవోపేతంగా జరిగే ఈ వేడుక... కరోనా కారణంగా నిరాడంబరంగా జరగనుంది.

badhradri ramayya kalyam today
నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం..

By

Published : Apr 2, 2020, 6:03 AM IST

Updated : Apr 2, 2020, 6:46 AM IST

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం... శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. వసంతపక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా... నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయితే ఆరు గంటలకే క్రతువు మొదలవగా.. మూలవరులకు అభిషేకం నిర్వహిస్తున్నారు. 8 గంటల నుంచి తొమ్మిది వరకు మూలవరులకు ఏకాంతంగా కల్యాణం నిర్వహిస్తారు. 9 గంటల నుంచి పది వరకు ఉత్సవ మూర్తులకు అలంకార సేవ ఉంటుంది. ఆ తర్వాత పదిన్నర నుంచి పన్నెండున్నర మధ్య కల్యాణ ఘట్టం వైభవోపేతంగా సాగనుంది. ఇందుకోసం ఆలయంలోని నిత్య కల్యాణ మండపాన్ని సిద్ధం చేశారు.

నేడే భద్రాద్రి రామయ్య కళ్యాణం

శుభ ముహూర్తానా...

సీతారాముల వారి కల్యాణ ఘట్టంలో తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత... రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు. అనంతరం సీతారాములకు రక్షాబంధనం కడతారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరుణ నిర్వహిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠించిన తర్వాత... స్వామివారికి పాద ప్రక్షాళన చేసి.. మహాదానాలు సమర్పిస్తారు. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేదమంత్రాలు మారుమోగుతుండగా... అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.

ప్రతీ ఇల్లు రామాలయమే...

ప్రతీసారి భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణల మధ్య వైభవోపేతంగా సాగే కల్యాణవేడుక.. ఈసారి నిరాడంబరంగా జరగనుంది. కరోనా కట్టడి కోసం లాక్​డౌన్ అమల్లో ఉన్న కారణంగా భక్తులు లేకుండానే రాములోరి పెళ్లి జరగనుంది. ఏటా మిథిలా మైదానంలో జరిగే వేడుకలు.. ఈ సారి ప్రధాన ఆలయంలోని నిత్య కల్యాణం జరిగే మండపంలోనే జరగనుంది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందించనున్నారు. భక్తులంతా ప్రసార మాధ్యమాల ద్వారా సీతారాముల కల్యాణం చూసి తరించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములను మేళతాళాలతో నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రేపు రాములవారి పట్టాభిషేకం జరగనుంది.

ఇవీచూడండి:కరోనాపై పోరుకు విరాళాలు అందిస్తున్న ప్రముఖులు

Last Updated : Apr 2, 2020, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details