వీణవంక ప్రజలకు ఏ ఆపద వచ్చినా... తాను పెద్దకొడుకులా ముందుంటానని యప్ టీవీ అధినేత ఉదయ్ నందన్ రెడ్డి (YuppTv Uday) అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వీణవంకలో మంచి ఆసుపత్రి, కల్వల చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండేటట్లు, చెరువుకు ఎప్పుడూ నీరు వచ్చేటట్లు ప్రాజెక్ట్ కావాలని ఎంతో మందిని అడిగినట్లు ఉదయ్ రెడ్డి (YuppTv Uday) గుర్తు చేసుకున్నారు.
శాశ్వత కాల్వల ప్రాజెక్ట్ కావాలని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao)ని కొద్ది నెలల క్రితం కోరినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు చేయించినట్లు చెప్పుకొచ్చారు. చదువుకున్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉదయ్ నందన్ రెడ్డి (YuppTv Uday Nandan Reddy)... పిల్లలందరినీ చదివించాలని కోరారు. వారి చదువుకు తగ్గట్లు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.
ప్రతి నెల లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాలు ఇక్కడి యువతకు ఇప్పించినట్లు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలిపి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు చూయించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. 12 ఏళ్ల క్రితమే వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్, హుజూరాబాద్ డాట్ కామ్ క్రియేట్ చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులు రూ.35లక్షలతో బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. వీణవంక మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకులా ముందు ఉంటానని హామీ ఇచ్చారు.