హుజూరాబాద్ ఉపఎన్నికల(Huzurabad by elections 2021) నేపథ్యంలో నియోజకవర్గంలో కవర్లు కలకలం రేపుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు డబ్బులతో కూడిన కవర్లు ఓటర్ల చెంతకు చేరుతున్నాయి. వాటిని అందుకున్న ఓటర్లు... కవర్లలో ఉన్న డబ్బు చూసి అవాక్కవుతున్నారు. ఒక్కో కవర్లో రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వంద మందికి ఒక స్థానిక నాయకుడిని అప్పజెప్పినట్లుగా పేర్కొన్నారు. పైగా డబ్బులు ఉన్న కవర్లపై నంబర్లు వేసి ఉండడం గమనార్హం. ఒకటో నంబర్ ఉంటే ఒకరికి, రెండో నంబర్ ఉంటే ఇద్దరికీ డబ్బులు అని ఓటర్లు అంటున్నారు. నేటితో ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో... తెరమీదకు వచ్చిన కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.
నేటితో మైకులు బంద్
మంత్రిగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరడంతో హుజూరాబాద్ ఎన్నికలు (huzurabad by election ) ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఉపఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్(తెరాస), ఈటల రాజేందర్(భాజపా), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల తరఫున మూడు పార్టీలు ప్రచారంలో నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చాయి.
తెరవెనుక మంత్రాంగానికి సిద్ధం
ఇప్పటివరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఓటుకు ఇంత మొత్తమనేలా నగదు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మద్యం సీసాలను పలుచోట్ల పంపిణీ చేశారనే ప్రచారం వినిపిస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా ఆయా పార్టీలవారు మాంసంతో పాటు మద్యాన్ని విరివిగా పంచారని అంటున్నారు.