ట్రాన్స్ జెండర్లను చూడగానే కొందరికి భయం, కొందరికి జాలి కలుగుతాయి. కానీ అధిక శాతం మంది వారిని చిన్నచూపు చూస్తారు. సమాజంలో ఇప్పటికీ వీరు వివక్ష ఎదుర్కొంటున్నారు. సొంతంగా పనులు చేయకుండా.. ప్రజల నుంచి డబ్బులు తీసుకుని జీవించడమే దీనికి ప్రధాన కారణమని కొందరి అభిప్రాయం. అయితే ఇలాంటి గుర్తింపు నుంచి బయటకు వచ్చి.. సొంతంగా వ్యాపారం పెట్టి గౌరవప్రదంగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు కరీంనగర్‌కు చెందిన ఈ ట్రాన్స్జెండర్లు.
ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు, పాలసీలు తీసుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎంప్లాయి మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కూడా ఈ కోవకి చెందిందే. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు దీన్ని తీసుకొచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. సొంతంగా వ్యాపారం పెట్టాలనుకునే ఔత్సాహికులను ప్రోత్సహించి రుణ సాయం అందజేస్తారు. అందులో 15 నుంచి 30 శాతం సబ్సిడీగా ఇస్తారు.
ఈ పథకాన్ని కరీంనగర్‌కు చెందిన ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉపయోగించుకుని తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నించడమే కాకుండా.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నక్క సింధుకు డ్రైవింగ్‌పై కొంత అవగాహన ఉంది. దీంతో స్థానిక సఖీసెంటర్కు వెళ్లి తనకు ఉపాధి చూపించమని కోరారు. జిల్లా సంక్షేమ అధికారి సాయంతో.. డ్రైవింగ్ స్కూళ్లో చేరి శిక్షణ తీసుకున్నారు. ఇటీవలే తనకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. త్వరలో రుణం తీసుకుని సొంతంగా కారు తీసుకుని టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తానని చెప్పారు.
ఇక ఆషాడం ఆశాకు చిన్నతనం నుంచే ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ అంటే ఆసక్తి. డిగ్రీ వరకు చదువుకుని, గ్రాఫిక్ డిజైన్ పట్ల ఆసక్తితో ఆ కోర్సు పూర్తి చేశారు. 2017 నుంచే చిన్న పాటి ఫొటో స్టూడియో నడుపుతూ జీవిస్తున్నారు. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నారు. కరీంనగర్ లోని సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్స్ హెల్ప్ లైన్ ద్వారా తన లాంటి వాళ్లకు కూడా ప్రభుత్వం పీఎంఈజీపీ కింద రుణాలు ఇస్తుందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. రూ.5 లక్షల రుణం అందించారు. దీంతో కేంద్రం పథకం తీసుకున్న తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని తెలిపారు.
బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద బిక్షాటన చేస్తూ, వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజల నుంచి సాయం కోరి జీవించే వీరికి కరీనంగర్ సఖీ సెంటర్ ద్వారా సాయం చేయాలని తలంచారు. అందులో భాగంగా కేంద్రంలో ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు గుర్తించి వారికి ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆషాడం ఆశా, నక్క సింధులాంట వాళ్లు ముందుకు వచ్చారు. మిగతా వారికి కూడా తమ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.