government schools: రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బడుల్లో ఇంకా పాఠ్య పుస్తకాలు పంపిణీకి నోచుకోలేదు. ఏటా మూణ్నెళ్లు ముందుగానే పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోని గోదాములకు చేరేవి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ముద్రణ, సరఫరా విషయంలో ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల పాఠశాలలు ప్రారంభమయ్యే రోజున విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూపదుస్తులు అందించలేదకపోయారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల 82 వేల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్న అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పుస్తకాల ముద్రణ పూర్తికాకపోవడం వల్ల ఇంకా పుస్తకాలు గోదాముల్లోకి చేరుకోలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమాలున్నందున అందుకు తగ్గట్లు ఒకే పుస్తకంలో ఆంగ్లం, తెలుగు పాఠ్యాంశాలు ముద్రిస్తామని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా గతేడాది అరకొరగానే పుస్తకాలు అందించారు. ఈ ఏడు ఇప్పటి వరకు కొత్త పుస్తకాలు రాకపోవడం వల్ల పాత వాటితోనే బోధన సాగిస్తున్నారు. కొత్త పుస్తకాలు వచ్చే వరకు తెలుగులోనే పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల సరఫరాలో జాప్యంతో ఆంగ్ల మాధ్యమ బోధనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు సత్వరం స్పందించి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు త్వరగా అందజేయాలని విద్యార్థులు...వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.