తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ లేఅవుట్లపై సుడా నజర్‌.. క్రమబద్ధీకరించుకునేలా అవగాహన

అక్రమ ప్లాట్లు, లేఅవుట్‌ లేని స్థలాలపై శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) దృష్టి సారించింది. దీని పరిధిలోని 71 గ్రామాల్లో అనధికారిక స్థలాలు గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అప్పటికీ అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోకపోతే కఠిన నిబంధనలు అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది.. అయితే ఇప్పటికే అక్రమ లేఅవుట్లతో ప్లాట్లు చేస్తుండటంతో వాటిని తొలగించి, నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.

karimnagar
karimnagar

By

Published : Jun 17, 2020, 1:04 PM IST

Updated : Jun 17, 2020, 1:47 PM IST

శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) పరిధిలోని గ్రామాలతో పాటు కరీంనగర్‌ జిల్లాలోని పుర, నగరపాలికల శివారుల్లో అక్రమ లేఅవుట్లు, అనధికారిక భవనాల సంఖ్య పెరిగిపోతున్నాయి. పెద్దపెద్ద వెంచర్ల స్థలాలను ప్లాట్లు చేసి విక్రయిస్తుండటంతో పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం, రోడ్లు, మురుగు కాల్వలు, సామాజిక అవసరాలకు కనీస స్థలాలు వదలడం లేదు. ఇలాంటి స్థలాలపై కఠినంగా ఉండేలా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్లకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సుడా నిబంధనల ప్రకారం అనుమతి లేని వెంచర్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. కొనుగోలు, అమ్మకాలు జరగకుండా వాటి లావాదేవీలు కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని సుడా, పట్టణ ప్రణాళిక అధికారులు చెబుతున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన

లేవుట్‌ లేని స్థలాలు(ఎల్‌ఆర్‌ఎస్‌) క్రమబద్ధీకరించుకోవడానికి పురపాలక శాఖ మరొక అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుండటంతో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులతో అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఉన్న లేఅవుట్‌ లేని స్థలాల జాబితాను కార్యదర్శులు సుడా అధికారులకు అందించారు. ఇందులో 120 వరకు అక్రమ లేఅవుట్ల స్థలాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎలాగైనా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునేలా స్థల యజమానులకు అవగాహన పెంచాలని ఇటీవల నగరపాలికలో జరిగిన సమావేశంలో సుడా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ స్థలాలతో ఇబ్బందులే..

పెద్ద పెద్ద స్థలాలు, వెంచర్లను ఇకపై లే అవుట్లు చేయాల్సిందే.. లేదంటే ప్లాట్లు విభజించి విక్రయించినా రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి ఉండదు.. ఎవరైనా ఇలాంటి స్థలాలు కొనుగోలు చేస్తే ఇబ్బందుల్లో పడటం తప్ప ఎలాంటి లాభం ఉండదు. గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో సుడా జారీ చేసిన లేఅవుట్‌ అనుమతి ప్లాను ఉందో లేదో పరిశీలించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించే అవకాశం ఉండదు. పైగా కరెంటు కనెక్షన్‌, నల్లా కనెక్షన్‌ ఇవ్వరు. ఎల్‌ఆర్‌ఎస్‌కు రాకపోతే వాటిపై కఠిన నిబంధనలు అమలు చేస్తారని అధికార వర్గాలు అంటున్నాయి.

అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ

అక్రమ లే అవుట్లకు నోటీసులు జారీ చేస్తాం.. ఇప్పటికే అలాంటి అనధికారిక స్థలాలు గుర్తించాం. గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోవాలి. లేదంటే సుడా నిబంధనలను కఠినంగా అమలు చేస్తాం.. సుడా దృష్టికి వస్తున్న అక్రమ లే అవుట్లను అధికారులు తొలగిస్తున్నారు.

- జి.వి.రామకృష్ణారావు, ఛైర్మన్‌, సుడా

ఇదీ చదవండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

Last Updated : Jun 17, 2020, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details