కరీంనగర్లోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో దశలవారీగా ఆంక్షలు సడలిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు నెల రోజులుగా ముకరంపుర ప్రాంతంలో ఇప్పటివరకు నో ఎంట్రీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిబంధనలను పాక్షికంగా సడలిస్తూ శనివారం నాలుగు గేట్లు తెరవనున్నట్లు వెల్లడించారు.
కరీంనగర్లో దశలవారీగా ఆంక్షలు సడలింపు - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో తొలిసారిగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కరీంనగర్లో పరిస్థితులు కుదురుకోవడం వల్ల రెడ్‌జోన్ ప్రాంతంలో ఆంక్షలు సడలిస్తున్నట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇండోనేసియన్లు పర్యటించిన కరీంనగర్లోని ముకరంపుర ప్రాంతంలో దశలవారీగా నిబంధనలు ఎత్తివేస్తామని వెల్లడించారు.
జిల్లా మొత్తంలో 19 కేసులు నమోదవ్వగా వాటిలో నాలుగు కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. తొలిరోజు ఉదయం నాలుగు గంటలపాటు గేట్లు తొలగిస్తారు. ఆ తర్వాత నుంచి రోజుకో గంట చొప్పున పెంచుతూ పూర్తిగా బారికేడ్లు ఎత్తివేయనున్నారు. తొలగించిన గేట్ల వద్ద వైద్య బృందాలు ఏర్పాటు చేసి వెళ్లి వచ్చే వారిని పరీక్షిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఆంక్షల సడలింపు సమయంలో నిత్యావసరాలు, మందులు వంటి వాటికోసమే బయటకు రావాలని... భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్