గతేడాది వచ్చిన కరోనా కష్టాల్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ దూరం చేసేలా ఆశలు రేకెత్తిస్తోంది... మాయదారి మహమ్మారిని తరిమేందుకు వ్యాక్సిన్‌ను ఈ వేడుక వెంటబెట్టుకొచ్చింది. ఇళ్లముంగిళ్లలో కొలువైన రంగవల్లికలు..ముగ్గు మధ్యలో కూర్చున్న గొబ్బెమ్మలు పండుగ పర్వదినాన్ని సంతోషంగా పలకరించేందుకు ఎదురుచూస్తున్నాయి. పిడకలతో మంటలు వేసి భోగభాగ్యాల భోగిని సంప్రదాయ బద్ధంగా జరుపుకొన్నారు. ఇదే ఆనందంతో నేటి వేడుకకు మరింత వన్నెతెచ్చేలా సిసలైన క్రాంతిని నింపుకొనేలా ఆసక్తిని కనబరుస్తున్నారు.
ప్రగతి శోభిల్లేలా.. పండుగ పరిఢవిల్లేలా..!
By
Published : Jan 15, 2021, 10:11 AM IST
ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం పలికేలా ఇళ్లముందు వేసే రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతూ మహిళామణులంతా సంక్రాంతిని సంతోషంతో జరుపుకొంటున్నారు. ఆత్మనిర్బర్ పథకంతోపాటు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాల్లో 90శాతానికిపైగా పురోగతి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పరిధిలోని 42వేలకుపైగా గ్రూపులకు ఇటీవల రుణసాయం రూపంలో లబ్ధిచేకూరింది. ఇల్లాలి వెలుగు ఇంటికే కాదు సమాజానికి మేలు చేసేలా వారి అడుగులు ఆశాజనకంగా పడబోతున్నాయి.
రైతు చుట్టే వేడుక వన్నె..
ఈ పండుగకు మూలవిరాట్టు రైతే. ప్రకృతి పండుగగా పిలిచే ఈ సంక్రాంతి నుంచే సిరిసంపదలన్నీ ఆయా పంటల రూపంలో రైతులకు చేరువవనున్నాయి. ఇది నిజమనేలా ఇప్పటికే ఈసారి కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో యాసంగి సాగులో పెద్దఎత్తున అన్నదాతలు జోష్‌ను చూపిస్తున్నారు. ఈ యాసంగిలోనూ సాధారణ విస్తీర్ణం 9.24లక్షల ఎకరాలను 10లక్షల ఎకరాల వరకు వివిధ పంటల్ని సాగు చేసేందుకు కర్షకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాలుగు జిల్లాలకు చెందిన 5.96లక్షల మంది రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది.
ఎగిరే గాలిపటమల్లే.!..
ప్రతికూలతలు, అనుకూలతల గాలి వీస్తున్న తరుణంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం కొలువుల భర్తీకి పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమవుతుండటంతో నాలుగు జిల్లాలోని ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉన్నత విద్యాప్రగతి విషయంలోనూ ఇన్నాళ్లుగా ఎదురైన ఇక్కట్లను అధిగమిస్తూ ఉన్నతులుగా మారాలని నాలుగు జిల్లాలోని సుమారు3లక్షల మంది యువత ఆశాజనకంగా ఉన్నారు. స్వేచ్ఛాయుత నిర్ణయాలతోపాటు ఇతరుల సూచనలతో ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
ఆరోగ్యమనే ‘సంపద’
కొవిడ్ కారణంగా ఇన్నాళ్లు ఆరోగ్యం విషయంలో ఆందోళన అనే పరిస్థితులే కనిపించాయి. ఇప్పటి వరకు 52వేలకుపైగా పాజిటివ్ కేసులు జిల్లాలో బయటపడ్డాయి. గతేడాది సంక్రాంతి పండుగ తరువాత సరిగ్గా రెండు నెలలకు కరీంనగర్‌లోనే కనిపించిన కరోనా ఛాయలు ఊహించని విపత్తును చూపించాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాపార, ఇతర వర్గాల వారు తేరుకుంటూ ఈ సంక్రాంతి నుంచి తమకు కలిసిరావాలనే ఆకాంక్షను బలంగా వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ఈ పండుగ తరువాతనే వ్యాక్సిన్ వేసుకునే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ సంక్రాంతి అసలైన ఆరోగ్య భరోసాను అన్ని వర్గాల ప్రజలకు కల్పిస్తోంది. ఈనెల 16వ తేదీనుంచి నాలుగు జిల్లాల పరిధిలోని 12,419మందికి తొలిదఫాగా టీకాలను వేయనుండటం పండుగ తెచ్చిన ఖ్యాతిగానే గుర్తుండిపోతోంది.