Sand dunes in farmlands in Karimnagar Floods 2023 :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పొలాల్లో వేసిన ఇసుక రైతులకు తలనొప్పిగా మారాయి. పెద్దపల్లి జిల్లాలో సుమారు 2 వేల 495 ఎకరాల్లో ఇసుక మేటలు గండ్లు, పడినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని ఏ రైతును కదిలించినా కన్నీటి ధారలే వస్తున్నాయి. నష్టం జాబితా అంచనా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం తప్ప ఏమేరకు పరిహారం వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చే మోరవంచ వాగుతో పాటు మానేరు పరివాహకంలోని ముత్తారం, మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఇసుక మేటలు వేశాయి. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, రామడుగు, గంగాధర మండలాల్లో వందల ఎకరాల్లో పొలాలను ఇసుక కప్పేసింది. మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో పాటు ఇసుక క్వారీల నిర్వహణ సైతం నష్టానికి కారణమౌతోందనిరైతులు వెల్లడిస్తున్నారు.
"ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇసుక మేటలు వస్తున్నాయి. మోటార్లు దొరకడం లేదు. నాలుగైదు సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. ఏమన్నా అంటే రైతుబంధు ఇస్తున్నాం అంటారు ఆ డబ్బులు పట్టాదారులకు పోతాయి కానీ కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదు." - బాధితులు
Karimnagar Floods 2023 : వరద ప్రవాహానికి ఆరు అడుగుల లోతు వరకు ఇసుక మేటలు వేసాయని రైతులు వాపోతున్నారు. ఒక్కో ఎకరంలోని ఇసుక తొలగించేందుకు లక్షలాది రూపాయల ఖర్చయ్యే నేపథ్యంలో అంతా డబ్బు తమ వద్ద లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామడుగు మండలంలో మోతెవాగుకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా పంట భూములు దెబ్బతిన్నాయి. గత యాసంగి సొంత డబ్బులతో ఇసుక తొలగించి పంట పండించిన రైతులకు ఈ ఏడాది మళ్లీ అదే పరిస్థితి ఎదురైందని విచారిస్తున్నారు. మోతె వాగుపై ఉన్న చెక్‌డ్యాంలు కొట్టుకుపోవటం వల్ల వాగు ప్రవాహం పొలాల్లోకి మళ్లిందంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో రూ.29 కోట్ల 45 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించినా.. గతేడాది పరిహారమే ఇప్పటి వరకు విడుదల కాలేదని అన్నదాతలు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
"నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వడం మర్చిపోయారు. అది తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎవరి పొలాలకు ఇసుక మేటలు వచ్చాయో వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. వారు తిరిగి సాగులోకి వచ్చే విధంగా ప్యాకేజీని ఇవ్వాలి." - శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే