ప్రజలు గుంపులుగా సంచరిస్తే వైరస్ సోకుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే నిబంధనలు సడలించినప్పుడు మాత్రం ప్రజలు నిబంధనలు పాటించకుండా పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్వచ్ఛందంగా తమకు సహకరించే వారు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 50మందికి పైగా ముందుకు వచ్చారు.
వారికి శిక్షణ ఇచ్చిన పోలీసులు... రద్దీగా ఉండే ప్రాంతాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవాలని.. శానిటైజర్లు వినియోగించాలని.. అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలని సూచనలు చేస్తున్నారు. గుంపులుగా కనిపించే వారు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్‌లో కూరగాయలు, పండ్ల మార్కెట్, చేపల మార్కెట్‌లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉండటంతో వాలంటీర్లు వారిలో అవగాహన కల్పిస్తున్నారు.