కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక(Huzurabad by poll) పోరులో నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతోంది. పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ రోజు మూడు నామపత్రాలు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి తెలిపారు.
భాజపా నుంచి ఈటల రాజేందర్ సతీమణి జమునను అభ్యర్థిగా పేర్కొంటూ ఆమె మద్దతుదారులు నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సిలువేరు శ్రీకాంత్, రేకల సైదులు నామినేషన్లు వేశారు. నామినేషన్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.