రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుడి చేత్తో సహయం చేస్తుంటే... భాజపా వాళ్లు ఎడమ చేతితో లాక్కుంటున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలోని పెద్దమ్మ గుడి, నాగమయ్య గుడి, దమ్మక్కపేటలోని కమ్యూనిటీ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఆలయ నిర్మాణానికి, కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు.
పన్నుల భారాన్ని మోపుతూ సామాన్యులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఆత్మగౌరవం పేరుతో గడియారాలు, బొట్టుబిల్లలు పంపిణీ చేస్తే.. భాజపా మోపుతున్న భారాన్ని మరిచిపోతారా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచుతూ సబ్సిడీలు తగ్గిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా గెలిచే అవకాశమే లేదన్నారు. వ్యక్తి ప్రయోజనం కన్నా.. నియోజకవర్గ ప్రజల ప్రయోజనం ముఖ్యమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
గడియారాలు పంచేటోళ్లు కావాలా..
"గడియారాలు పంచేటోళ్లు కావాలా లేక ఆపదలో ఆదుకునే ప్రభుత్వం కావాలా అనేది ఆలోచించుకోవాలి. ప్రజాసంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. సుమారు రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారితో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఖర్చులు ఎక్కువయ్యాయి.. ఆదాయం తక్కువైంది. అయినప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు. మందులు, ప్రజా సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. వచ్చే ఏడాదిలోగా రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తాం. వడ్డీతో సహ ప్రభుత్వమే చెల్లిస్తుంది. నిన్నటిదాక మంత్రిగా పని చేసిన ఈటల... ఒక్క రెండు పడకల గదుల ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. మంత్రిగా ఏడేళ్లుగా ఉన్నప్పుడు ఒక్క అభివృద్ధి పని కూడా చేయని ఈటల.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తాడు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి. రెండు పడకల గదుల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుంది." - హరీశ్‌రావు, మంత్రి