హుజూరాబాద్ ఉపఎన్నికలో రైతు బాంధవులకు ఓటు వేస్తారా లేక రైతుల ఊసురు తీసే పార్టీకి ఓటేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వెంకటసాయి గార్డెన్‌లో విత్తనోత్పత్తి రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఉపఎన్నిక కోసం దిల్లీ నుంచి కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.
కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడైనా ఓ పది రూపాయల పని చేశాడా అని విమర్శించారు. రానున్న ఉప ఎన్నికలో భాజపా నేత ఈటల గెలిస్తే ఏం అభివృద్ధి జరగుతుందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పని చేసే తెరాస ప్రభుత్వాన్ని గెలిపించుకుని మన పనులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్రం రైతులకు ఏం చేసిందో కూడా అందరూ ఆలోచించాలన్నారు. ధరలు పెంచిన సామాన్యులకు మోయలేని భారాన్ని మోపిన భాజపాకు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరయ్యారు.