దళిత బంధు పథకాన్ని రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao on Balit Bandu) స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబం, రేషన్ కార్డు ఉన్న వారందరికి దళితబంధు పథకం డబ్బులు జమ అవుతాయని హరీశ్ భరోసానిచ్చారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
స్వయం ఉపాధి...
దళితబంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని మంత్రి హరీశ్‌రావు (Finance Minister Harsih Rao) అన్నారు. దళితబంధు పథకం కింద వచ్చే రూ.10 లక్షలతో ఒక్కొక్కరు 4 యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న దళితులందరికి దళితబంధు డబ్బులు అందుతాయని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలందరకీ మూడు రోజుల్లోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని కలెక్టర్‌ను హరీశ్ రావు ఆదేశించారు.
రివ్యూలో పాల్గొన్న మంత్రులు ఇదీ చూడండి: Dalita Bandhu: దళితబంధు నిధులతో ఆ యూనిట్ల ప్రోత్సాహానికి ప్రభుత్వం మొగ్గు!
ఫోన్లకు మెసేజ్‌లు...
ఖాతాలలో పడ్డ డబ్బులను ప్రభుత్వం వెనుకకు తీసుకోదని... ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలని మంత్రి సూచించారు. యూనిట్లు స్థాపించుకునేంతవరకు ఖాతాలో నిల్వ ఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తాయని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బ్యాంకులలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి దళితబంధు పథకం డబ్బుల గురించి అడిగే లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. డబ్బులు అకౌంట్లలో జమ అయిన అందరికి రెండు రోజుల్లోగా మెసేజ్‌లు పంపాలని... బ్యాంకర్లను ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలల్లో పర్యటించి దళితబంధు రాని వారి వివరాలు సేకరించి డబ్బులు జమ చేయడంతో పాటు క్రాస్ చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు.
వారికి కూడా...
రేషన్ కార్డు లేని వారి నుంచి ఆధార్ నంబర్ తీసుకొని ఈ నంబర్‌తో రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉందో తనిఖీ చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వారికి కూడా దళితబంధు అమలవుతుందని వివరించాలని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల లబ్దిదారులతో విడతల వారీగా గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని.. అందులో తనతో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, క్లస్టర్ అధికారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:CM KCR: దశల వారీగా రాష్ట్రమంతా దళితబంధు.. ఏటా బడ్జెట్లో కేటాయింపులు
ఈనెల 21న నియోజకవర్గంలోని 7 మండలాల్లో అధికారులతో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి.. అర్హులైన వారికి వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఆర్వీకర్ణన్ తెలిపారు. డబ్బులు జమ అయిన వారి సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం అందిస్తామన్నారు. ఈనెల 23న టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి లబ్దిదారులతో మాట్లాడి ఏమైనా సందేహాలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. డైయిరీ యూనిట్లు స్థాపించుకునే వారికి శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు.
ఇదీ చూడండి: DALITHA BANDHU: వాసాలమర్రి లబ్ధిదారులకు దళితబంధు నగదు డిపాజిట్