తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదారమ్మ సోయగం... మరో జలదృశ్యం ఆవిష్కృతం

కాళేశ్వరం బృహత్తర పథకంలో మరో జలదృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మధ్య మానేరు) 25 గేట్లను ఎత్తడం వల్ల దిగువ మానేరుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నీటి విడుదలతో నది పరీవాహక ప్రాంతం, కాలువల పరిధిలోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో జలదృశ్యం ఆవిష్కృతం

By

Published : Sep 1, 2019, 7:09 AM IST

Updated : Sep 1, 2019, 11:48 AM IST

గోదారమ్మ సోయగం... మరో జలదృశ్యం ఆవిష్కృతం

సాగుభూముల్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం బృహత్తర పథకంలో మరో జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఇప్పటికే శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి చేరిన గోదారమ్మ... దిగువకు బిరబిరా ప్రవహిస్తోంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం 25 గేట్లను ఎత్తడం వల్ల దిగువ మానేరు దిశగా 42వేల క్యూసెక్కుల ప్రవాహం వెళ్తోంది. శుక్రవారం రాత్రి మూడు గేట్లను ఎత్తిన అధికారులు శనివారం ఉదయం కల్లా 25గేట్లు ఎత్తారు.

ఒక్కరోజులో 2.5టీఎంసీలకు పైగా...

కరీంనగర్​ను అనుకుని ఉన్న దిగువ మానేరు జలాశయానికి ప్రస్తుతం ఇన్​ఫ్లో పెరుగుతోంది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా పేరొందిన ఎస్సారెస్పీ నుంచే ఇన్నాళ్లు దిగువ మానేరుకు నీటి విడుదల జరిగేది. పక్షం రోజుల కిందటి వరకు 3.55 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా... శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వరద పోటెత్తడం వల్ల ఒక్కరోజులోనే 6 టీఎంసీలకు పైగా పెరిగింది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఈ జలాశయానికి వరుసగా 3రోజుల పాటు ఇదే ఇన్​ఫ్లో కొనసాగితే 15 టీఎంసీలపైగా చేరవచ్చు. జలాశయంలోకి 8టీఎంసీల మేర చేరితే కాకతీయ కాలువలోకి నీటిని విడుదల చేసేందుకు వీలుంటుంది. ఇది జరిగితే స్థిరీకరణ ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టు కలిపి సుమారు 3లక్షల ఎకరాలకు నీరు అందే వీలుంది.

ముఖ్యమంత్రి ఆదేశాలతో....

రెండున్నరేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఎస్సారెస్పీ ద్వారా దిగువ మానేరుకు వచ్చే జలాలను నిల్వ చేయాలనే ఉద్దేశంతో 25.84 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. గతేడాది అనుకున్న స్థాయిలో వానలు పడకపోవడం వల్ల 8.6టీఎంసీలు మాత్రమే వచ్చింది. ఈ సారి మాత్రం కాళేశ్వరం జలాల రాకతో 16టీఎంసీలకు పైగా నీరు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు నీటి విడుదల క్రతువును అధికారులు ప్రారంభించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

మధ్యమానేరు నుంచి ఎల్​ఎండీ వరకు ఉన్న 8 కి.మీ మేర మానేరు నదిలో జలకళ ఏర్పడింది. రాత్రివేళ నీటిని విడుదల చేయడం వల్ల ఈ నదిలోని ఆయాప్రాంతాల్లో చిక్కుకుపోయిన వేయి వరకు గొర్రెలు, వాటి కాపరులను పోలీసులు, ఇతర అధికారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. నీటి విడుదలతో నది పరివాహక ప్రాంతం, కాలువల పరిధిలోని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: విజయవంతమైన నాలుగో పంపు వెట్​రన్​

Last Updated : Sep 1, 2019, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details