కరోనాను అదుపు చేసేందుకు విధించిన లాక్డౌన్... అన్ని రంగాలపై ప్రభావం పడింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతతోపాటు రోజూవారి కూలీ పనులు చేసే వారికి పనులు లేకపోవడం వల్ల ఆదాయం దారుణంగా పడిపోయింది. దీనితో తమకు వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలన్న పాఠాన్ని ప్రజలు నేర్చుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది.
ఈ క్రమంలో సర్కార్ ఆదాయం పెంచుకునేందుకు మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. దీనితో మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు బారులు తీరి కనిపించారు. అయితే రెండు మూడురోజులు కొనుగోలుదారులు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.
అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఇవే
ప్రధానంగా బీర్లు భారీగా అమ్ముడయ్యే ఏప్రిల్, మే మాసాల్లో మద్యం దుకాణాలు అనుమతించకపోవడం చాలా నష్టాన్ని మిగిల్చిందని చెబుతున్నారు. 2019 మేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 49 వేల బీర్ల పెట్టెలు విక్రయిస్తే... ఈసారి మాత్రం కేవలం 2లక్షల 72వేల బీర్ల పెట్టెలు మాత్రమే విక్రయించారు.
దాదాపు 58శాతం అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు మొత్తుకుంటున్నారు. లాక్డౌన్ క్రమంలో 266 దుకాణాల్లో నిల్వ ఉన్న బీర్లు చెడిపోయాయని అధికారులు తెలిపారు. సరైన సీజన్లో దుకాణాలు బంద్ కావడం.. బార్లకు అనుమతి లభించకపోవడం కూడా మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.