SRSP Land grabbing: కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూములకు డిమాండ్ బాగా పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో భవిష్యత్ అవసరాలను గుర్తించి లేఅవుట్‌లకు అనుమతివ్వాలని ప్రభుత్వం శాతావాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. కరీంనగర్ చుట్టుపక్కల 72 గ్రామాలను సూడా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో నగునూరులో లేఅవుట్‌కు సూడా అనుమతిచ్చిన విధానం పోలీసులకు ఫిర్యాదు చేసే స్థాయికి చేరింది. స్థిరాస్తి వ్యాపారులు తమ లేఅవుట్ ఆమోదం పొందాలంటే ఆ వెంచర్‌కు కనీసం 40 అడుగుల రహదారిని చూపాల్సి ఉంటుంది. నగునూరులోని ఓ స్థిరాస్తి వ్యాపారి.. శ్రీరాంసాగర్ డీ-93 కాల్వ స్థలాన్ని రోడ్డుగా చూపుతూ లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగా సూడా అధికారులు కూడా ఎలాంటి తనిఖీలు చేయకుండానే లేఅవుట్‌కు అనుమతిచ్చారు.
ఈ భూమి కోసం స్థిరాస్తి వ్యాపారి ముందుగా కొందరు రైతులతో కలిసి పొలాలకు తాత్కాలిక రోడ్డు కావాలంటూ దరఖాస్తు చేయించాడు. అన్నదాతల కోసం నీటిపారుదలశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డుకు అనుమతిచ్చారు. అయితే తారు రోడ్డు వేస్తుండడంతో అనుమానించిన అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీశారు. విచారణలో కొంతమంది రైతులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి రోడ్డు ప్రణాళిక రూపొందించారని తేలడంతో వెంటనే గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు.