పాఠశాలల్లోని విద్యార్థులకు విషయ బోధన కంటే దృశ్య రూపంలో వివిధ రకాల ప్రయోగాలు, ఆవిష్కరణలు వారి మెదళ్లలో నిక్షిప్తం చేసేలా నిలిచే కరీంనగర్‌లోని జిల్లా సైన్స్ మ్యూజియంపై మూడు నాలుగేళ్లుగా నిర్లిప్తత అలుముకుంది. ప్రయోగ పరికరాల నిర్వహణకు నిధుల లేమి, సిబ్బంది కొరతతో కొంతకాలంగా నిరాదరణకు గురవుతోంది. విద్యాశాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తుండగా.. పాలకులు, జిల్లా అధికార యంత్రాంగం దీన్ని ఏనాడో మర్చినట్లున్నారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు సమీప జిల్లాలోని విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ మ్యూజియాన్ని సందర్శనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నది విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆకాంక్షగా మారుతోంది.
ఆసక్తి పెంపే లక్ష్యంగా..
2005లో రాష్ట్ర విద్యాశాఖ రూ.20 లక్షల వ్యయంతో కరీంనగర్‌లోని ప్రభుత్వ పురాత ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఆలోచింపజేసే శాస్త్ర, విజ్ఞాన ప్రయోగాలు, ఆవిష్కరణలతో దీన్ని తీర్చిదిద్దారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితంతో పాటు వీటి అనుసంధానంతో ఆలోచింపజేసే ఆసక్తికరమైన 60కి పైగా ప్రయోగాల వర్కింగ్ మోడల్స్‌ను ఇందులో ప్రదర్శనగా ఉంచారు.