కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. నగరంలోని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. కరోనా పోరులో ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతిమ ఫౌండేషన్‌ను ప్రశంసించారు. మహమ్మారితో కలిసి జీవిస్తూనే.... జీవనోపాధి కూడా మెరుగుపర్చుకోవాలని సూచించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాన్న మంత్రి...జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారిన పడ్డారని గుర్తుచేశారు.
విపక్షాలు నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రావాలి
కరోనా పోరులో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవంటూ మంత్రులు కేటీఆర్, ఈటల కొట్టిపారేశారు. దేశంతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని గుర్తుచేశారు. సరైన సందర్భం కాదని కేంద్రంపై విమర్శించడం లేదన్న కేటీఆర్.. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రావాలి కానీ.. అసంబద్ధ విమర్శలు సరికాదని హితవు పలికారు.