ఆ పాఠశాలను సందర్శించిన వారు అక్కడి పరిసరాలను చూసి హరితవనంలో అడుగెట్టామన్న అనుభూతి పొందుతారు. పచ్చని వాతావరణం, రంగు రంగుల పూల మొక్కలు ఆకట్టుకుంటాయి. పిల్లలకు చదువుతో పాటు.... హరితక్షేత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు.
పచ్చని బడిలో... సాగుతున్న పాఠాలు..
రాజుల కాలంలో విద్యాబోధన చేసే గురుకులంలా... ప్రకృతి ఒడిలో సేదదీరుతున్న హరిత వనంలా ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది రాగంపేట జడ్పీఉన్నత పాఠశాల. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల శ్రద్ధతో హరితవనంగా తయారైంది. పూలమొక్కలతో పాటు.. కూరగాయలు పండిస్తూ మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పచ్చదనంతో ప్రత్యేకతను చాటుకుంటోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజస్వామి, ఉపాధ్యాయులు రామయ్య, నర్సయ్య కృషితో పాఠశాలను హరితవనంగా మార్చారు. పూల మొక్కల పెంపకంతో పాటు కూరగాయల సాగు చేపట్టారు. రసాయనాలు వాడకుండా పండించిన పంటలతోనే మధ్యాహ్న భోజనం వండి... వడ్డిస్తున్నారు. హరితవనంలా ఆకట్టుకుంటున్న ఈ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
హరితక్షేత్రం చేయడంలో పిల్లలను భాగస్వాములను చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందని ఉపాధ్యాయలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ప్రతిజ్ఞ సమయానికి ముందే... మొక్కల బాగోగులు చూసుకోవడం విద్యార్థుల దినచర్యలో భాగమైంది. 2017లో రాగంపేట ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ అవార్డును పొందింది. విద్యార్థులకు పచ్చదనం ఆవశ్యకతను బోధిస్తున్న రాగంపేట ఉన్నత పాఠశాల ప్రకృతి విశిష్టతను చాటుతోంది.