కరీంనగర్ - జగిత్యాల రహదారి విస్తరణ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ… కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత రహదారి విస్తరణ.. భూసేకరణ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోగా… ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి తోడు… మరమ్మతులు లేకపోవడంతో వాహన చోదకులు ముప్పుతిప్పలు పడుతున్నారు.
ఒక్కో గొయ్యి.. ఒక్కో అడుగు
వరంగల్ నుంచి జగిత్యాల వరకు.. రహదారి నిరంతరం రద్దీతో కిక్కిరిసిపోతోంది. దీనికి తోడు రెండేళ్లుగా ఈ రహదారిలో మరమ్మతులు కరవయ్యాయి. పర్యవసానంగా ఈ రోడ్డుపై వెళ్లే వాహనాలు నత్తనడకన నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలకమైన రహదారిలో ఒక్కో గొయ్యి సుమారు ఒక్కో అడుగు వరకు ఉందని… వాహనచోదకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ - జగిత్యాల రహదారిని విస్తరించడంతో ఇబ్బందులు తగ్గుతాయనుకుంటే… అది కాస్తా కాగితాలకే పరిమితమైందని ఈ ప్రాంతవాసులు వాపోతున్నారు. దాదాపు అయిదేళ్లుగా ఎవరికి వారే జాతీయ రహదారిని మంజూరు చేయించామని గొప్పలు చెప్పడమే తప్పా… ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నుంచి నిజామాబాద్, మహారాష్ట్ర వెళ్లే వాహనాలన్నీ… ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. దీనికి తోడు వరంగల్ నుంచి ధర్మపురి, కొండగట్టుకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది.
అటు ఎంపీగారు కేంద్రం నిధులిచ్చింది అంటున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేమే జాతీయ రహదారి చేయిస్తున్నామని చెప్తున్నారు. రాజకీయ సౌలభ్యం కోసం జాతీయ రహదారి మేము తెచ్చామంటే మేము తెచ్చామనుకుంటున్నారు కానీ.. చేతల్లో మాత్రం పనులు సాగట్లేదు. పేపర్లో కోట్లరూపాయల్లో అంకెలు వస్తున్నాయి తప్పా... రోడ్ల మరమ్మతు చేసే నాథుడే లేడు.
-స్థానికుడు
భూసేకరణలో జాప్యం
ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న కరీంనగర్-జగిత్యాల రహదారిని విస్తరించేందుకుగాను 100 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన భూసేకరణలోనే జాప్యం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ రహదారి కొత్తపల్లి మీదుగా వెళ్తుండటంతో… గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విస్తరణతో కొత్తపల్లి పట్టణంలో సుమారు 1200 మందికి నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపడుతున్నప్పుడు.. రోడ్డును గ్రామం నడిబొడ్డున నుంచి కాకుండా బైపాస్ రోడ్లు నిర్మిస్తున్నారని కొత్తపల్లిలోను అదే తరహా నిర్మాణం చేపట్టాలని.. గతంలో స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే రహదారి విస్తరణ ఎలా చేపడతారు.. అనే స్పష్టత లేకపోగా భూసేకరణలోను ఎనలేని తాత్సారం జరుగుతోందని వాహనచోదకులు వాపోతున్నారు.
రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అస్సలు తిరగలేకపోతున్నాము. కుదుపులకు వాహనాలు పాడైపోతున్నాయి. రోజంతా కష్టపడి ట్రిప్పులకు తిరుగుతుంటే... ఆ డబ్బులు వాహనాలు బాగు చేసుకునేందుకే సరిపోతున్నాయి. గుంటల్లోకి ఆటో పోతుంటే టైరు బయటకు రావాడం చాలా కష్టమైతోంది. అంత లోతుగా గుంటలు ఉన్నాయి.