Traders Reducing the Price of Cotton: ఉత్తర తెలంగాణలో రెండోఅతి పెద్ద మార్కెట్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పత్తి రాక మొదలైంది. పట్టణం నుంచే కాకుండా హన్మకొండ, ములుగు, కరీంనగర్ జిల్లాల రైతులు తమ సరకును అమ్మకానికి తీసుకొస్తున్నారు. మంచి ధర పలుకుతుందనే ఆశతో మార్కెట్‌కు వస్తే వారి ఆశ అడియాసగానే మిగిలిపోతుంది. 9వేల రుపాయలకు పైగా ధర పలుకుతుందని అనుకున్న రైతుకు నిరాశే మిగులుతోంది.
మార్కెట్‌కు తెచ్చిన పంటను వ్యాపారులు చేతిలో పట్టుకొని వేలం ద్వారా ధరను నిర్ణయిస్తున్నారు. వారు పాడిందే పాట. వారు నిర్ణయించిందే ధర కావడంతో రైతు జేబుకు చిల్లులు పడుతున్నాయి. కొనుగోలుదారులంతా ఏకమై ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాల వల్ల పంట నష్టపోయిన తమకు, కనీస మద్దతు ధర రావట్లేదని వాపోతున్నారు.
నాణ్యమైన పత్తి ఉన్నా వ్యాపారులంతా కలిసి తమను మోసం చేస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన కూలీలు, రవాణాచార్జీలతో కనీసం క్వింటాలుకు 9వేల రూపాయలకు పైగా వస్తే గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. వ్యాపారులు ధరలో కోత పెట్టడమే కాకుండా నిర్ణయించిన ధరతో మిల్లుకు తీసుకెళ్తే, అక్కడా 50నుంచి 100 రుపాయల వరకూ దోచుకుంటున్నారని వాపోతున్నారు.
ఒకరిద్దరికి మంచి ధర ఇచ్చి ధర బాగా ఉందని ప్రకటించుకొని, మిగతా వాళ్లకు మాత్రం కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చుల రీత్యా పంటను వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి లేదని ఎంత నిర్ణయిస్తే అంతకే ఇచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. వ్యాపారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేయకుండా ప్రభుత్వం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించి తమను ఆదుకోవాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు
ఇవీ చదవండి: