కరీంనగర్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం.. వైరస్ మరింత విస్తరించకుండా అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తొలుత వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చే వారని హోటళ్లలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రజలు గుంపులుగా ఒక చోట గుమికూడకుండా ఉండేందుకు రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. దీనితో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద, మధ్యతరహా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
క్రమంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ను పెంచుతూ పోయింది. దీనితో ప్రధానంగా సీ-కేటగిరిలోకి వచ్చే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు అందులో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. సాధారణంగా హోటళ్లలో పనిచేసే వారు అధికశాతం ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారున్నందున హోటళ్లు నడవని కాలంలో వారిని పోషించడం భారంగా మారింది. దీనితో లాక్‌డౌన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మికులను తమ స్వగ్రామాలకు వెళ్లిపోవాలని సూచించారు. మూడు నెలలపాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన డబ్బును సమకూర్చడం హోటల్ యజమానులకు భారంగా మారింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు లాక్‌డౌన్ పూర్తి అయ్యాక వస్తారా లేదా అన్న అనుమానం హోటల్ యజమానులను వెంటాడుతోంది.
దాదాపు రెండు నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసి ఉన్నందున నిర్వహణ పన్నుల చెల్లింపుతో పాటు విద్యుత్ బిల్లులు భారంగా మారాయని చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ కాలంతో ప్రజలంతా ఇంటి భోజనానికి అలవాటు పడటం.. దీనికితోడు హోటల్‌లో ఒకరి భోజనం కోసం అయ్యే ఖర్చుతో ఒక కుటుంబం ఖర్చు గడుస్తుందనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్న ఆందోళన యజమానుల్లో కనిపిస్తోంది. ప్రధానంగా హోటల్ పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉండే చెఫ్‌లు మళ్లీ అందుబాటులోకి వస్తారా లేదా అన్న అనుమానం వెంటాడుతోందని అంటున్నారు. కొత్తగా వచ్చే మాస్టర్ల వల్ల తమ హోటల్‌కు పూర్వకాలంలో గిరాకీ మళ్లీ వస్తుందా..? ప్రజలు పూర్వం వచ్చే విధంగా తమ హోటళ్లకు అప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించడం లేదనే బెంగ యజమానులను వెంటాడుతోంది.