ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ (MOU) కుదర్చుకొని పంట చేతికొచ్చే సమయానికి సాధ్యం కాదని చేతులు ఎత్తేయడం దారుణమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు కాళేశ్వరం జలాలు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకొందామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) యత్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎనలేని మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
కరీంనగర్లో మీడియా మాట్లాడిన మంత్రి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిన కేంద్రం ఈసారి రారైస్ కొనుగోలులోనూ కోత విధించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62లక్షల మెట్రిక్ టన్నుల రాబియ్యం ఉంటే కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా బియ్యాన్ని మేము ఏం చేసుకోవాలని ప్రశ్నించారు.
బియ్యం కొనుగోలు చేయాలని మేము భిక్షం అడగడం లేదన్న గంగుల... రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేసి తెలంగాణా పట్ల వివక్ష చూపడమేంటని ప్రశ్నించారు. పంట వేసుకున్నాక బియ్యం కొనుగోలు చేయబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బియ్యం ఎగుమతి, నిల్వ, ధర స్థిరీకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలని... అలాంటి సందర్భంలో చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.