దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భాజపా నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యాక తొలిసారిగా హుజురాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలను కలిశారు. దళిత బంధు పథకాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయని చెప్పారు. అన్ని కులాల వృత్తుల వారికి ఒక పథకాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశానికి లోనవుతున్నారన్నారని మండిపడ్డ ఈటల.. ప్రభుత్వం చేసిన సర్వేల్లోనే తన గెలుపు ఖాయమని తేలిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే పదజాలం సరైంది కాదన్నారు.
EETELA ON DALITHA BANDHU: దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి: ఈటల
దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాజీమంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అన్ని కులాల వృత్తుల వారికి ఒక పథకాన్ని రూపొందించాలని కోరారు. దళిత బంధు పథకాన్ని నాతోపాటు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నోటిఫికేషన్‌కు ముందే హామీలు అమలు చేయాలి
గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల పునరుద్ఘాటించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారన్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.150కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారన్నారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికతోనే కేసీఆర్‌కు హామీలు గుర్తొచ్చాయి. అందుకోసమే కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిరుద్యోగభృతిని తక్షణమే అమలు చేయాలి. గత ఏడేళ్లలో ఏనాడూ అంబేడ్కర్‌కు కేసీఆర్ దండవేయలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీసేశారు. దళిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దాన్ని వర్తింపజేయాలి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను సైతం ఆదుకోవాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హుజూరాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా. నేను డ్రామాలు ఆడేవాడిని కాదు.. సీరియస్ రాజకీయ నాయకుడిని. డ్రామాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వైద్యుల సూచన మేరకు రెండు మూడు రోజుల తర్వాత పాదయాత్ర పునఃప్రారంభిస్తా’’ అని ఈటల చెప్పారు.