హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై (Model Code of Conduct ) భారత ఎన్నికల సంఘం (election commission of India)స్పష్టత నిచ్చింది. 2018లో రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ఉపఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయమే హజూరాబాద్లోనూ అమల్లో ఉంటుందని స్పష్టత నిచ్చింది.
ఏంటా నిర్ణయం..
వాస్తవానికి ఏదైనా నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే ఆ జిల్లా మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అయితే 2018లో రాజస్థాన్‌లోని దుడు శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరిగినపుడు జైపూర్ జిల్లా మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తొలుత ఈసీ ప్రకటించింది. అయితే రాజస్థాన్ రాజధాని కూడా అదే జిల్లా పరిధిలో ఉన్న నేపథ్యంలో సాధారణ పరిపాలనకు ఇబ్బంది అవుతోందని ఈసీకి విజ్ఞప్తులు అందాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే జిల్లా మొత్తం కాకుండా కేవలం ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే నియమావళి (Model Code of Conduct ) వర్తిస్తుందని.. ఈసీ స్పష్టతనిచ్చింది. అంటే ఈ నిర్ణయం ప్రకారం కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉండనుంది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపింది.
హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హన్మకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. దీంతో కరీంనగర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లు ఉన్నందున కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.