ED Notices to Shwetha Granites and Shwetha Agencies :రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ఈడీ) నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనల కింద జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శ్వేతా గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్ పేరిట గ్రానైట్ కంపెనీలను గంగుల సుధాకర్, గంగుల వెంకన్న నిర్వహిస్తున్నారు. గ్రానైట్స్‌ను చైనాకు ఎగుమతి చేసిన ఈ రెండు కంపెనీలు.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు తేల్చారు.
ఈడీ నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మీడియా వాళ్లు చెబితేనే తనకు తెలిసిందన్న మంత్రి.. 2008 నుంచి ఈడీ నోటీసులు వస్తూనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా శ్వేతా గ్రానైట్స్ ఎప్పుడూ తప్పు చేయలేదని.. గిట్టని వాళ్లు తమపై ఎన్నో ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఈడీ నోటీసులు ఇస్తే పత్రాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. తాము బ్యాంకు లావాదేవీలు చేశామని, హవాలా చేయలేదని స్పష్టం చేశారు.
నాకు ఈడీ నోటీసులు అందలేదు. మీడియా వాళ్లు చెప్తేనే నాకు తెలిసింది. 2008 నుంచి ఈడీ నోటీసులు వస్తూనే ఉన్నాయి. 3 దశాబ్దాలుగా శ్వేతా గ్రానైట్స్ ఎప్పుడూ తప్పు చేయలేదు. గిట్టని వాళ్లు మాపై ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఈడీ నోటీసులు ఇస్తే పత్రాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మేము బ్యాంకు లావాదేవీలు చేశాం.. హవాలా చేయలేదు. - మంత్రి గంగుల కమలాకర్
మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు.. తాళాలు పగులగొట్టించి మరీ!
ED Notices To Minister Gangula :మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)కు చెందిన ఈ గ్రానైట్స్ సంస్థల్లో గతేడాది నవంబర్‌లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లోని మంత్రికి సంబంధించిన సంస్థలు సహా 9 గ్రానైట్ కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌రావు అనే వ్యక్తి 2021లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై 2019లో బండి సంజయ్ సైతం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు కంప్లైంట్ల ఆధారంగా గత సంవత్సరం నవంబర్ నెలలో ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్‌లోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ నగర్‌లోని శ్వేతా గ్రానైట్స్ సహా బంజారాహిల్స్‌లోని గ్రానైట్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాలా చిత్రీకరిస్తున్నారు : మంత్రి గంగుల
Gangula on Granite Business : రాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఎకరాల కంటే.. ఎక్కువ స్థలంలో మైనింగ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. తద్వారా పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాక ప్రభుత్వ ఖజానాకూ నష్టం చేకూర్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గతంలో 9 మైనింగ్ సంస్థలకు ప్రభుత్వం రూ.750 కోట్లు జరిమానా విధించినా చెల్లించకుండా అక్రమ మార్గంలో మినహాయింపు పొందినట్లు దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది.
ఇదిలా ఉండగా.. కరీంనగర్ గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో పెద్ద మొత్తంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎగుమతి చేసిన గ్రానైట్‌కు కాకుండా.. తక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించినట్లు ఈ సంస్థలపై ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఈడీ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఈ సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చిన అధికారులు.. జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు.
మంత్రి గంగుల సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ, ఈడీ సోదాలు.. రూ.50 కోట్లు సీజ్
బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టడానికే ఇవన్నీ.. : ఏదేమైనా రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న ప్రస్తుత తరుణంలో.. బీఆర్‌ఎస్‌లో మళ్లీ 'ఈడీ' కలవరం మొదలైంది. ఈ ఎన్నికల్లోనూ తామే గెలిచి హ్యాట్రిక్ కొట్టాబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న 'కారు' నేతలకు ఈ దర్యాప్తు సంస్థల దాడులు, నోటీసులు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల ముంగిట కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
దూకుడు పెంచిన ఈడీ.. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరిపై దర్యాప్తు