Dengue Cases: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు.. ఇటీవల భారీవర్షాలతో జనవాసాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో దోమలు పెరిగిపోయి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ వ్యాప్తి చేసే దోమకు 24 నుంచి 30డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉండగా.. ఇటీవల వాతావరణ మార్పులతో ఈ దోమ పెరిగే ఆస్కారం అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
పారిశుద్ధ్య చర్యలు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. 'డ్రై'డే పాటించాలనే ప్రచార హోరు తప్పితే ఆచరణలో మాత్రం ఎక్కడా అమలవటం లేదు. ఈ ఆర్నెళ్ల కాలంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 42వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు 4వేల మందికి పైగా రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 175 మందికి డెంగీ నిర్ధారణ అయింది.
మానకొండూర్, గంగాధర, కొత్తపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఎలిగేడు మండలం ధూళికట్ట, మానకొండూరు మండలం వెల్ది.. ఈ మూడు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు డెంగీ కారణంగా చనిపోయారు. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలతో ఆస్పత్రులు సైతం కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల వద్ద నిత్యం వందల సంఖ్యలో జ్వరబాధితులు బారులు తీరుతున్నారు.
ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతుండగా.. దీనికి తోడు జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ నిర్ధారణతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రతి జ్వరాన్నీ డెంగీగా భావించాల్సిన అవసరంలేదని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నెలతో పోల్చితే సర్కార్ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. గత నెలలో రోజుకు 500నుంచి 600 మంది వరకు రాగా ప్రస్తుతం 800 మంది ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు.