Skating Race: కరీంనగర్‌లో చిన్నారులు స్కేటింగ్ పట్ల అమితాసక్తి చూపుతున్నారు. గతంలో రోలార్ స్కేటింగ్ శిక్షణకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు దిగువమానేరు జలాశయం వద్ద నేర్చుకునేవారు. కరీంనగర్ ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరిన తర్వాత.. హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన క్రీడా సదుపాయాన్ని స్మార్ట్‌సిటీ నిధులతో ఇక్కడ ఏర్పాటు చేశారు. స్కేటింగ్‌లో ఆసక్తి కనబరుస్తున్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు నగరంలోనే ప్రత్యేక రింక్ ఏర్పాటు చేశారు.
కొత్త రింక్...
గతంలో నిర్మించిన రింక్ పాడవటంతో.. రూ.30లక్షలతో కొత్త రింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో నగరంలోని చిన్నారులు.. కాళ్లకు చక్రాలు కట్టుకుని రింక్‌లో సాధన చేస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్రస్థాయిలో బంగారు, రజత పతకాలు సాధించారు.