Elkathurthi-Siddipet road widening works: ఎల్కతుర్తి – సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది. రోడ్డు విస్తరణ పనుల కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతికపరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎన్హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్దిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరిపాలనాపరమైన పనులకు ఆమోదం తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది.
పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి
ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్ నిర్మించనున్నారు. వీటితోపాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జీలను కూడా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్దిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగా పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.