మేధావి వర్గం బయటికొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టాల్సిన అవసరముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన పురప్రముఖుల సభలో రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల కంటే పెద్ద అవినీతి పరులు ఇంకెవరు లేరని.. ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించినందుకే.. ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాజపాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మేధావులు బయటకు రావాలి...
"మేధావి వర్గం బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎంతో కష్టపడి.. ఎంతో మంది బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో జనాలకు తెలియజేయాల్సిన అవసరముంది. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని... అరెస్టులై.. సాధించుకున్న రాష్ట్రంలో అవినీతి పాలనను ఎదుర్కునేందుకు భాజపాతో కలిసి పనిచేయండి. ఉద్యమ సమయంలో ఎంతో మంది ఉద్యమకారులకు అండగా నిలిచాడని ఈటలను సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. కొవిడ్ సమయంలో రిస్క్ తీసుకుని కష్టపడ్డాడని స్వయంగా ఆయన్నే పొగిడాడు. అదే ఈటల రాజేందర్.. అవినీతిని ప్రశ్నిస్తే... బయటకు పంపించాడు. ఆయనను ఎవ్వరు ప్రశ్నించినా.. బయటకు పంపించుడే. మేం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మా కార్యకర్తలు ఎన్ని లాఠీ దెబ్బలు తింటున్నారో మాకు తెలుసు. ప్రశ్నించిన ఎంతో మంది కార్యకర్తలను జైళ్లలో పెడుతున్నారు. కేసీఆర్ పుట్టకముందే.. ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ భాజపా. కేసీఆర్ పార్టీ పుట్టకముందే ఎంతో మంది నక్సలైట్ల దాడులను ఎదుర్కొన్న పార్టీ భాజపా. అటువంటిది కేసీఆర్‌కు ఎట్ల భయపడతాం. ఇప్పటికైనా మేధావి వర్గం మౌనంగా ఉంటే.. భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. భాజపాతో కలిసి నడవండి. రాష్ట్రానికి మంచి భవిష్యత్ తీసుకొచ్చేందుకు బయటకురావాలి." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు