నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 550 పడకలు ఉండగా... ఒక్క పడక కూడా ఖాళీ లేదంటే జ్వరాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఆస్పత్రికి 1100 ఓపీ ఉంటుంది. సోమ, శని వారాల్లో ఈ సంఖ్య 1300 దాటుతుంది. ఇందులో ప్రతి రోజూ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య 350 నుంచి 450గా ఉంటోంది. అలాగే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే జ్వర బాధితుల సంఖ్య అధికంగానే ఉంటోంది. ప్రతి రోజూ 90 నుంచి వంద మంది ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరుతుండగా... ఇందులో సగం అంటే 50 మంది వరకు జ్వరంతో బాధపడుతున్నారు. గత 20 రోజుల్లో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలు జ్వరంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
చిన్నపాటి జ్వరాలకే ప్టేట్లైట్స్ తగ్గుదల
కామారెడ్డి జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఎక్కడ చూసినా రోగులు జ్వరంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వంద పడకలుండగా... ప్రతి రోజూ ఇన్ పేషెంట్లు 30-40 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరిలో జ్వరంతో బాధపడేవారి సంఖ్య 25 వరకు ఉంటోంది. ప్రతి రోజూ అవుట్ పేషెంట్లు 850 నుంచి 920 వరకు ఉంటున్నారు. వీరిలో జ్వరంతో బాధపడేవారు దాదాపు 600 మంది వరకు ఉంటున్నారు. అయితే చిన్నపాటి జలుబు, జ్వరానికే ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోతుండటం వల్ల జనం హైదరాబాద్కు పరుగులు పెట్టాల్సి వస్తోంది.