ఆర్మూర్ డివిజన్‌లోని చాలా మండలాల్లో సేద్యానికి నీటి వనరులు తక్కువే. సాగునీటికి కర్షకులంతా బోరుబావులపై ఆధారపడతారు. బోరు మోటారు కాలిపోయినప్పుడు మాత్రం దాన్ని పైకి తీసి మరమ్మతులు చేయించడం కష్టంగా మారింది. గతంలో కనీసం ఆరుగురు వ్యక్తులు కలిసి రోజంతా శ్రమించి పైకి తీసేవారు. ప్రస్తుతం కొన్నిచోట్ల చేతిపంపు చైన్ పద్ధతిలో కష్టంగా నలుగురు కలిసి శ్రమిస్తున్నారు. మోటార్లను పైకి తీస్తుండగా జారిపోయి బోరుబావిలో పడిన సంఘటనలు లేకపోలేదు.
రూ.4.20 లక్షలతో..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్ కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో జీప్ మెకానిక్‌గా పనిచేసేవారు. తరచూ ఆర్మూర్ ప్రాంతానికి వచ్చివెళ్తుండేవారు. లోతైన బోరుబావి నుంచి మోటార్లను పైకి తీసి మరమ్మతులు చేయడానికి రైతులు పడే కష్టాలను స్వయంగా చూశారు. దీనికి సులువైన మార్గమేదైనా ఉంటుందేమోనని ఆలోచించారు. బెంగళూరులోని ఓ సంస్థను ఆశ్రయించి తన ఆలోచనలతో లిఫ్టింగ్ యంత్రాన్ని తయారు చేయించారు. దాన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుగా ట్రాక్టర్‌కు బిగించారు. మొత్తం రూ.4.20 లక్షలతో యంత్రం సిద్ధమైంది.