తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao twitter: రోగి, వైద్యుడు మృతిపై మంత్రి హరీశ్ స్పందన - తెలంగాణ వార్తలు

Gandhari heart attack: గాంధారి మండలంలో రోగి, వైద్యుడు మృత్యువాత పడిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రోగికి చికిత్స అందిస్తూనే వైద్యుడు మృతిచెందడం బాధాకరమని ట్వీట్ చేశారు.

Harish rao twitter, Gandhari heart attack
రోగి, వైద్యుడు మృతిపై మంత్రి హరీశ్ స్పందన

By

Published : Nov 29, 2021, 12:08 PM IST

Harish rao tweet on Doctor, patient heart attack: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రోగికి చికిత్స చేస్తూ వైద్యుడు మృత్యువాత పడిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రోగికి చికిత్స అందిస్తూనే వైద్యుడు లక్ష్మణ్ మృతి చెందడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన బాధాకరమని ట్విటర్​లో పోస్ట్ చేశారు.

ఏం జరిగింది?

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్యానాయక్(48) గొల్లాడితండాలోని బంధువుల ఇంటికి శనివారం దినకర్మకు వెళ్లారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు హుటాహుటిన అతన్ని గాంధారి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయ్యప్ప మాల ధరించిన వైద్యుడు డా.ధరంసోత్ లక్ష్మణ్ అప్పుడే పూజ ముగించుకుని ఆస్పత్రికి వచ్చి గుండెపోటు వచ్చిన రోగిని పరీక్షిస్తున్నాడు. ఇంతలోనే వైద్యుడు లక్ష్మణ్ సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పేషెంట్​ను చూస్తూనే హఠాత్తుగా కింద పడిపోయాడు. అక్కడి సిబ్బంది, ఇతర ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తుండగానే కన్నుమూశారు. పేషెంట్​కు వైద్యం అందిస్తూనే ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యుడు గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. వైద్యుడు మరణించిన విషాద సమయంలోనే రోగిని బతికించుకునేందుకు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రోగి మరణించాడు.

వైద్యుడి గుండెకు ఇది వరకే స్టంట్

వైద్యం చేస్తూనే మృతి చెందిన వైద్యుడు లక్ష్మణ్ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా విధులు నిర్వర్తిస్తూ గాంధారిలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం టేకులపల్లి తండా వైద్యుడి స్వస్థలం. హైదరాబాద్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ సర్జన్ పూర్తి చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు శ్రీజ(13), దక్షిణి(11), భార్య స్నేహలత ఉన్నారు. వైద్యుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. అయితే వైద్యుడికి ఇది వరకే గుండెకు స్టంట్ వేసినట్టు తెలిసింది. రోగి జగ్యా నాయక్ మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడు జగ్యానాయక్​కు ముగ్గురు కుమారులు ఉండగా.. ఇద్దరికి పెళ్లిళ్లు కాగా మరొకరు హైదరాబాద్​లో విద్యనభ్యసిస్తున్నారు.

రోగి, వైద్యుడి కుటుంబాల్లో విషాదం

సాధారణంగా రోగి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంతగానో శ్రమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగిని కాపాడాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. అందుకోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రాణం పోయాలని చూస్తారు. అయితే కామారెడ్డి జిల్లాలో రోగికి వైద్యం అందిస్తూనే వైద్యుడు చనిపోవడం విచారం కలిగించింది. రోగితోపాటు, వైద్యుడి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

ఇదీ చదవండి:Mariamma Custodial Death : 'మరియమ్మ కేసు ముగింపు బాధ్యత ప్రభుత్వానిదే'

ABOUT THE AUTHOR

...view details