Kamareddy Master Plan Issue Updates: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో బాధితగ్రామాల రైతులతో సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడించిన విషయాలపై చర్చించారు. అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎవరిని నమ్మేదిలేదని ముందుకే వెళ్లాలని తీర్మానించారు.
భూములు కోల్పోయే ప్రసక్తే లేదు: ఎట్టి పరిస్థితుల్లో భూములను కోల్పోయే ప్రసక్తే లేదన్నారు. నేడు మున్సిపల్ కౌన్సిలర్లందరికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11 న పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని తీర్మానించారు . అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో పారిశ్రామిక, గ్రీన్జోన్ల కింద పంటలు పండే పొలాలను ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు.
ఈనెల 4న.. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి కోల్పోతున్నాన్న ఆందోళనతో రైతు బలవన్మరణం చెందడంపై ఆందోళనలు మొదలయ్యాయి. మరుసటి రోజు కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీచేసిన అన్నదాతలు.. కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారు. లోపలికి అనుమతించకపోడంతో కలెక్టరేట్ ఎదుట ఆరుగంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టారు.
రైతుల అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం: మరుసటి రోజు కలెక్టర్ తీరుకు నిరసనగా కామారెడ్డి బంద్ పాటించారు. అదే రోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మాస్టర్ ప్లాన్‌పై కలెక్టర్ జితేశ్‌పాటిల్ మీడియాసమావేశం నిర్వహించి రైతుల అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరింత స్పష్టతఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారుచేసిన కన్సల్టెన్సీ, డీటీసీపీ అధికారుల తప్పులే వివాదానికి కారణమని వివరించారు . ఆ పొరపాట్లు సరిదిద్దుతూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పారిశ్రామిక, గ్రీన్ జోన్‌లను.. రైతుల భూముల్లో కాకుండా ప్రభుత్వభూముల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
జీవో వచ్చేంతవరకు.. ఉద్యమం వీడబోమని స్పష్టం చేసిన అన్నదాతలు: కలెక్టర్, ఎమ్మెల్యే చేసిన ప్రకటనలను రైతులు స్వాగతించారు. అదేసమయంలో ప్రభుత్వం నుంచి జీవో వచ్చేంతవరకు.. ఉద్యమం వీడబోమని స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన కోసం కర్షకులకు మద్దతుగా.. పదవులకు కొందరు రాజీనామాలు చేస్తున్నట్టు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈనెల 11 తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వెల్లడించింది.